TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నీలి బృంగాది తైలం.. ఇది జుట్టుకు చేసే మేలు ఏంటంటే..!

Published on: Fri Sep 18, 2026 10:13AM

నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే  ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి,  జీవనశైలి సరిగా లేకపోవడం,  రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..

నూనె తయారీలో వాడే పదార్థాలు..

ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే  బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు,  మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది.

ప్రయోజనాలు..

నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా  తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.

జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి.

ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది.

ఎలా వాడాలి? 

ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో  సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక.

                       *రూపశ్రీ.