TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నయన్తార సహగల్ ఆన్ డైనాస్టిక్స్ వ్యాసం: నాలుగు దశాబ్దాల రాజకీయ పరిణామాలపై విశ్లేషణ.!

Published on: Wed Nov 18, 2026 3:58PM

భారతదేశ రాజకీయ చరిత్రలో నెహ్రూ గాంధీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే అదే కుటుంబానికి చెందిన, దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మేనకోడలు నయన్తార సహగల్ గతంలో రాసిన ఒక వ్యాసం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు విజయలక్ష్మి పండిట్ కుమార్తె అయిన నయన్తార సహగల్..  1984 జనవరి మొదటి వారంలో  సెమినార్ పత్రికలో  ఆన్ డైనాస్టిక్స్  పేరుతో ఒక సంచలన వ్యాసాన్ని ప్రచురించారు. ఇందిరా గాంధీ రెండవ పదవీకాలంలో.. రాజీవ్ గాంధీ రాజకీయ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ వ్యాసం వెలువడడం అప్పట్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   దేశాన్ని తన సొంత కుటుంబ ఆస్తిగా భావించే పాలక వర్గాల ధోరణిని ఆమె ఆ వ్యాసంలో   తప్పుపట్టారు. వంశపారంపర్యంగా అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచన మొత్తం రాజకీయ వ్యవస్థ  కుళ్ళిపోయే గాయంతో సమానంగా నయన్తార సహగల్  అభివర్ణించారు. 

మూడవ ప్రపంచ దేశాలలో కనిపించే నియంతలు కూడా తమ పదవులను కుమారులకు బదిలీ చేసేందుకు అంతగా ప్రయత్నించలేదని, కానీ ఇందిరా గాంధీ తన కుమారుడికి దేశాన్ని బహుమతిగా ఇవ్వాలని ఎందుకు భావిస్తున్నారని ఆమె సూటిగా, ఎలాంటి శషబిషలూ లేకుండా ప్రశ్నించారు. అధికారాన్ని వదలడానికి ఇష్టపడని తీరును ప్రయోగశాల నేల మీద పెరుగుతున్న వేడిలో నాట్యం చేస్తూ కూడా తన వేరుశెనగలను వదలని కోతితో పోల్చడం ఆ వ్యాసం మొత్తంలో ప్రత్యేకతగా నిలిచింది.

ఈ వ్యాసం చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే..  1969 నుంచి నెహ్రూ గాంధీ వంశానికి మద్దతుగా ప్రత్యేక అపోహలను సృష్టించే యంత్రాంగం మొదలైందని సహగల్ పేర్కొన్నారు. 1977లో అత్యవసర పరిస్థితి కాలం నాటి ఓటమిని కుటుంబం కేవలం ఒక ప్రమాదంగా భావించిందని..  అందుకే గాంధీ పాలనకు ప్రజలను నిరంతరం అలవాటు చేసేందుకు ఈ ప్రచారాలు దోహదపడ్డాయని సెహగల్  విశ్లేషించారు. 1980లో సంజయ్ గాంధీ మరణం తర్వాత ఇందిరా గాంధీలో పెరిగిన ఒంటరితనం, ఆ తర్వాత రాజీవ్ గాంధీని రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలను ఆమె దగ్గరి నుంచి గమనించారు.   

వంశపారంపర్య రాజకీయాల ప్రభావం కేవలం రాజకీయ రంగంపైనే కాకుండా సమాజంపై, మీడియాపై కూడా తీవ్రంగా ఉంటుందని ఈ వ్యాసం ద్వారా ఆమె స్పష్టం చేశారు. బోర్డింగ్ స్కూళ్లలో ప్రత్యేక రక్షణలు, పరీక్షలు లేకుండా లభించే సీట్లు, ప్రభుత్వ పరంగా జరిగే శతాబ్ది వేడుకలు, విదేశాల్లో ఏర్పాటు చేసే స్మారక ప్రొఫెసర్‌షిప్‌లు అన్నీ ఒక వ్యక్తి చుట్టూ ప్రచారాన్ని సృష్టించే ప్రయత్నాలేనని ఆమె విమర్శించారు. కోట వెలుపల నుంచి కాకుండా డ్రాయింగ్ రూమ్ లోపల నుంచే కుటుంబ వ్యవహారాలను చూసిన ఒక వ్యక్తి చేసిన ఈ విశ్లేషణ అప్పట్లో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.  

ఇది కూడా చదవండి:  ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారు..సోనియా ఆత్మకథలో సంచలన విషయాలు. !

 కాలక్రమేణా రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ, నయన్తార సహగల్ రాసిన ఈ వ్యాసంలోని అంశాలు ఇప్పటికీ రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చకు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు సొంత కుటుంబాన్ని తీవ్రంగా విమర్శించిన ఆమె, తర్వాతి కాలంలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మారిన వైఖరిపై భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి. ఏదేమైనప్పటికీ, రాజకీయాల్లో వంశపారంపర్య ప్రాధాన్యతలను  వాటి పరిణామాలను అద్దం పట్టిన ఈ చారిత్రక పత్రం భారతీయ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.  నిలిచిపోతుంది.

ఎందుకంటే.. సెహగల్ 1984లో ఈ వ్యాసం రాశారు. నెహ్రూ మేనకోడలుగా ఆమె తన వ్యాసంలో..  ప్రయోగశాల నేల మీద పెరుగుతున్న వేడి మీద నాట్యం చేస్తున్న కోతి, తన పిడికిలిలోని వేరుశెనగలను వదలడానికి నిరాకరించడం అంటూ సొంత కుటుంబ సభ్యులను లక్ష్యం చేసుకుని ఘాటు విమర్శలు చేశారు.  వారసత్వ ప్రాప్యతను సంపాదించి అదే చట్టబద్ధతగా పొరబడే  దేశంలోని ప్రతి రాజకీయ కుటుంబం అదే నేల మీద నాట్యం చేస్తోంది.  అవతలి పక్షంలో   మాత్రమే వంశపారంపర్య పాపాన్ని కనుగొనే ప్రతి వ్యాఖ్యాత అదే వేరుశెనగలను పట్టుకుని ఉన్నారు. 


మీకు నచ్చవచ్చు:  రాజీవ్‌ గాంధీకు నో.. రాహుల్‌కు ఓకేనా? సోనియా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.!

ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!


-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[NayantaraSahgal, NehruGandhi, Family,  Dynastics, SeminarMagazine,PoliticalDynasty, TeluguOne]