TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎఫ్‌ఐఆర్ లేని కేసులో ఈడీ దర్యాప్తు: చెల్లుబాటుపై అనుమానాలు.!

Published on: Sat Nov 14, 2026 1:36PM

దేశ  న్యాయ వ్యవస్థలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సంచలనాత్మక కేసుల్లో నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారం ఒకటి. అయితే ఈ కేసు కేవలం ఒక రాజకీయ వివాదానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్   దర్యాప్తు అధికారాలకు సంబంధించిన  మూల సూత్రాన్ని ప్రశ్నించే స్థాయికి చేరింది. పోలీసుల నుంచి ఎలాంటి  ఎఫ్‌ఐఆర్ నమోదు కాకుండా, కేవలం ఒక ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించడం చట్టబద్ధమేనా అనే ప్రశ్న ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. ఈ కీలక  అంశంపై తదుపరి విచారణ జరగనుండటంతో, భవిష్యత్తులో జరిగే అనేక దర్యాప్తులకు ఈ తీర్పు ఒక దిక్సూచిగా మారుతుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.   ఈ కేసు మూలాలను పరిశీలిస్తే.. ఇది 2012 నాటిది. స్వాతంత్ర్యద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో ప్రారంభమైన నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే  అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) సంస్థకు సంబంధించిన లావాదేవీలు వివాదాస్పదమయ్యాయి. ఏజేఎల్ కు ఇచ్చిన రుణానికి బదులుగా దాని షేర్లు  యంగ్ ఇండియన్  సంస్థ చేతికి వెళ్లాయనీ, దీనివల్ల పత్రికకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులు పరోక్షంగా ఒక కుటుంబం నియంత్రణలోకి వచ్చాయన్నది ఆరోపణ.   ఈ క్రమంలో 2012 నవంబర్ 1న అప్పటికి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఢిల్లీ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేటు క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. 

సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు మరికొందరు కుట్రపూరితంగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.  2014లో మేజిస్ట్రేట్ కోర్టు ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని సోనియా, రాహుల్ తదితరులకు సమన్లు జారీ చేసింది. ఇక్కడే ఈ కేసులో  చట్టపరంగా తొలి   మలుపు చోటుచేసుకుంది, ఎందుకంటే పోలీసుల ఎఫ్ఐఆర్ లేకుండానే నేరుగా కోర్టు గదిలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి.   కొన్ని సంవత్సరాల తరువాత..  ఈ ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగానే రంగంలోకి దిగిన ఈడీ, 2021 జూన్ 30న ఎన్ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ ఫర్మేషన్ (ఈసీఐఆర్)  నమోదు చేసి మనీలాండరింగ్ దర్యాప్తు  చేపట్టింది. అయితే..  ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్  ప్రకారం ఒక  నేరం జరిగి ఉండాలనీ,  దానికి సంబంధించి  పోలీసు ఎఫ్ఐఆర్ ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆ సమయంలో  నేరానికి సంబంధించి ఎలాంటి పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో,  ఈడీ చర్యల చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వివాదంపై విచారణ జరిపిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు, ఎఫ్ఐఆర్  లేదన్న కారణంతో ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. దీంతో ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ   హైకోర్టును ఆశ్రయించింది.   

ఈ కేసు దర్యాప్తు క్రమంలో అనేక మలుపులు తిరిగింది. 2025 ఏప్రిల్‌లో ఈడీ తన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేయగా.. అదే ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవొడ్బ్ల్యు) ఈడీ అధికారిక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను తప్పుపడుతూ ఈడీ హైకోర్టులో వాదనలు వినిపిస్తోంది. మరోవైపు, ఏజేఎల్ సంస్థకు చెందిన సుమారు  752 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ గతంలో అటాచ్ చేయగా, ఆ ఆస్తుల విడుదల ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరిన ఈడీ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయడం, షెడ్యూల్డ్ నేరం లేకుండా ఈసీఐఆర్ నమోదు చేయడం వంటి అంశాలపై హైకోర్టు ధర్మాసనం ఈడీకి పలు   ప్రశ్నలు సంధించింది.  

ఇది కూడా చదవండి: మన దేశంలో న్యాయానికి ఒక లెక్క ఉంటుంది...

ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయ వర్గాలలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని అధికార పక్షం వాదిస్తోంది. అయితే రాజకీయాలకు అతీతంగా, ఈ కేసు ఇరువైపులా ఉన్న న్యాయపరమైన చిక్కుల వల్ల  ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా నేరుగా ఈడీ రంగంలోకి దిగవచ్చా లేదా అనేదానికి పీఎమ్ఎల్ఏ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఏమున్నాయనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. 

ఒకవేళ ప్రైవేటు ఫిర్యాదులు సరిపోతాయని తీర్పు వస్తే అది భవిష్యత్తులో అనేక పరిణామాలకు దారితీస్తుందని, అలా కాదని తీర్పు వస్తే ఇదే పద్ధతిలో నడిచిన ఇతర కేసులైనా నీరుగారిపోయే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.   ప్రజాస్వామ్య వ్యవస్థలో దర్యాప్తు సంస్థల స్వయంప్రతిపత్తి, పౌరుల హక్కులు మరియు చట్టబద్ధమైన నిబంధనల అమలుపై ఈ కేసు ఒక స్పష్టతను ఇస్తుందని భావిస్తున్నారు. ఈసీఐఆర్ పత్రాలు బహిర్గతం కాకపోవడం మరియు దర్యాప్తు ప్రాథమిక దశల అస్పష్టత వంటి అంశాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు కేవలం ఈ ఒక్క నేషనల్ హెరాల్డ్ కేసుకే పరిమితం కాకుండా, దేశంలోని మనీలాండరింగ్ నిరోధక చట్టాల అమలు తీరుతెన్నులను పూర్తిగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. చట్టం ముందు అందరూ సమానులేనని నిరూపించేలా న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.  

మీకు నచ్చవచ్చు:  నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కు నోటీసులివ్వలేం: కోర్టు

నేషనల్ హెరాల్డ్.. సోనియా, రాహుల్ ఏం చేస్తారో..?


-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[NationalHerald, JL, Moneylaundering, FIR, ED,  FIR, ECIR]