చంద్రబాబు బాహుబలిలో భళ్లాలదేవ

 

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో ఏమాత్రం పన్నులు పెంచలేదని.. కోట్లాది మంది చెల్లిస్తున్న పన్నుల వల్లే విద్య, మౌలిక సదుపాయాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని మోదీ అన్నారు. రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను లేకుండా చారిత్రక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఆ నిర్ణయం నేటినుంచి అమల్లోకి వచ్చిందన్నారు. పన్ను పరిధిని పెంచాలంటూ ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నప్పటికీ గత ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోలేదని.. మేం దానిపై కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశంలోని ఉన్నత వర్గాల్లోని నిరుపేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేంద్రానిదే అన్నారు

గత 40 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోదీ ఆరోపించారు. తొలి కేబినెట్‌ భేటీలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని.. ఇప్పటి వరకు రూ.7వేల కోట్ల నిధులిచ్చామని చెప్పారు. ఈ ప్రాజెక్టు అంచనాలను టీడీపీ ప్రభుత్వం పెంచుకుంటూ పోతోందన్నారు. ఈవిధంగా అంచనాలు పెంచుకోవడం ద్వారా ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని మోదీ విమర్శించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు ప్రభుత్వానికి లేదన్నారు. ఏపీ అభివృద్ధికి ఏన్డీయే సర్కార్‌ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు. రైతుల మేలు కోసం కేంద్రం అనేక పథకాలు చేపట్టిందన్నారు.

సీఎం చంద్రబాబు స్టిక్కర్‌ బాబుగా మారారని ప్రధాని దుయ్యబట్టారు.కేంద్ర ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు స్టిక్కర్లు అంటించుకుంటున్నారని మోదీ ఆరోపించారు. చంద్రబాబు పరిస్థితి ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడిలా మారిందని విమర్శించారు. ఆయన పాలన అధర్మంగా, అన్యాయంగా ఉందన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని మోదీ విమర్శించారు. ఆయన మాటలను ఆంధ్రా ప్రజలు ఎప్పటికీ నమ్మరన్నారు. ఇక్కడి ప్రజలు నీతిగా జీవిస్తారని.. చంద్రబాబు మాత్రం వారిని మోసం చేస్తుంటారని దుయ్యబట్టారు. సేవా మిత్ర యాప్‌ ద్వారా ప్రజలకు టీడీపీ సేవ చేయడం లేదని ఆరోపించారు. ‘సేవ లేదు.. మిత్రులు కాదు.. ప్రజల వివరాలు దొంగిలించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌లకు ప్రజల సంక్షేమం పట్టదన్నారు. వాళ్ల కుటుంబ పాలన కోసమే పాకులాడుతున్నారని మోదీ విమర్శించారు.