TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వాధినేతగా మోడీ పాతికేళ్ల ప్రస్థానం: అభివృద్ధి గణాంకాలు.. రాజకీయ వివాదాలు.!

Published on: Fri Oct 9, 2026 4:32PM

దేశ రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలిచిన పరిణామంలో..  ప్రభుత్వ అధినేతగా నరేంద్ర మోదీ  రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సరిగ్గా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన మోడీ, ఆ తర్వాత క్రమంగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అధిష్టించారు. 2026 అక్టోబర్ 7 నాటికి ఆయన వరుసగా పాతికేళ్ల  పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగి రికార్డు సృష్టించారు.  

ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తుతిస్తూ  కేంద్ర మంత్రివర్గం ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని ఆమోదించి ఆయనపై అభినందనల వర్షం కురిపించింది.  మరోవైపు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పరిణామాలు ఈ వేడుకలపై ప్రభావం చూపాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పన్నెండున్నర ఏళ్లు,  దేశ ప్రధానిగా మరో పన్నెండున్నర ఏళ్ల పాటు సాగిన ఈ పాలనా కాలం దేశ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.   ఈ సుదీర్ఘ పాలనా కాలంలో దేశంలోని వివిధ రంగాలలో జరిగిన మార్పులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి. 

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నివేదికల ప్రకారం, వైద్య విద్య రంగంలో భారీ విస్తరణ జరిగింది. 2014 నాటికి దేశంలో కేవలం 387గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ప్రస్తుతం 846కు చేరుకుంది. అదేవిధంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 51 వేల 348 నుంచి లక్షా 39,864కు పెరిగింది.  పీజీ మెడికల్ సీట్ల సంఖ్య 31 వేల185 నుండి 86 వేల 360కు  వృద్ధి చెందింది. అయితే.. ఈ సీట్ల పెంపులో ప్రైవేట్ రంగం వాటా క్రమంగా పెరుగుతూ రావడం.. 2026-27 నాటికి ప్రైవేట్ కళాశాలల వాటా 54 శాతానికి చేరుకోవడం పట్ల సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వైద్య విద్య ఖరీదైనదిగా మారిందనే విమర్శలు కూడా పొలిటికల్ సర్కిల్స్ నుంచీ, జనబాహుల్యం నుంచీ గట్టిగానే వినిపిస్తున్నాయి.  మరోవైపు ఆర్థిక,  సామాజిక భద్రతా రంగాల్లోనూ భారీ సంఖ్యలో పథకాలను అమలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 58.63 కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభం కాగా, వీటిలో  దాదాపు 55.74 శాతం ఖాతాలు మహిళల పేరున ఉండగా, 77.80 శాతం ఖాతాలు గ్రామీణ, హాష్ అర్బన్ ప్రాంతాలకు చెందినవే కావడం గమనార్హం.

అలాగే ముద్రా రుణాల పథకం కింద సుమారు 59.14 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయగా, మొత్తం కేటాయింపుల విలువ   41.71 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. పేద మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉజ్జ్వల యోజన కింద సుమారు 10.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఆరోగ్య రంగానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ కింద 2026 ఆగస్టు నాటికి 45.5 కోట్లకు పైగా కార్డులను జారీ చేయగా, సుమారు 96 కోట్ల ఏబీహెచ్ఏ ఆరోగ్య ఐడీలు సృష్టించబడ్డాయి. దేశవ్యాప్తంగా 1.86 లక్షలకు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి.   ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణం కేవలం సంక్షేమ పథకాల అమలుకే పరిమితం కాలేదు.. దీని వెనుక ఎన్నో చారిత్రక పరిణామాలు,  మలుపులు ఉన్నాయి. సరిగ్గా 2001లో గుజరాత్ భూకంపం సృష్టించిన విలయం నుంచి రాష్ట్రం కోలుకుంటున్న తరుణంలో నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ సమయంలో అప్పటి కేశూభాయ్ పటేల్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండేది. ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే జరిగిన గోద్రా రైలు దహన ఘటన,  దానిని అనుసరించి  రాష్ట్రవ్యాప్తంగా పెచ్చరిల్లిన హింస పెను రాజకీయ వివాదంగా మారింది. ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే ఆయన 2002, 2007, 2012 శాసనసభ ఎన్నికలలో వరుస విజయాలు సాధించి గుజరాత్‌లో తన పట్టును నిరూపించుకున్నారు. 

అనంతరం 2014 సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని విజయపథంలో  నడిపించారు. ఆ ఎన్నికల్లో సొంతంగా 282 స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 2019 నాటికి ఆ సంఖ్యను 303కు పెంచుకుంది. అయితే 2024 ఎన్నికలలో మాత్రం సంఖ్య తగ్గి 240 స్థానాలకే పరిమితం కావడంతో సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది.   ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు, దీనికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ వాదనలు కూడా   గట్టిగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న అసమానతలు, ఉపాధి నాణ్యత వంటి అంశాలపై ప్రతిపక్షాలు,  ఆర్థిక విశ్లేషకులు   ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆవర్తన శ్రామిక శక్తి సర్వే (పీఎల్ఎఫ్ఎస్) 2025 నివేదిక ప్రకారం దేశంలో మొత్తం నిరుద్యోగ రేటు 3.1 శాతంగా ఉన్నప్పటికీ, 15 నుండి 29 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది 9.9 శాతానికి, పట్టభద్రులైన యువతలో 6.5 శాతానికి చేరింది. అదేవిధంగా ప్రపంచ అసమానతా నివేదిక (వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2026) ప్రకారం భారతదేశంలో అత్యున్నత స్థాయిలోని ఒక శాతం జనాభా దేశంలోని మొత్తం సంపదలో దాదాపు 40 శాతాన్ని, ఆదాయంలో 22 నుండి 23 శాతాన్ని తమ చేతుల్లో ఉంచుకోగా, అట్టడుగున ఉన్న సగం జనాభా కేవలం 15 శాతం ఆదాయాన్ని మాత్రమే పొందుతున్నది. ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా పెరిగినప్పటికీ..  ఆ ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందలేదనే విమర్శలకు ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ సందర్భంగా దేశంలో అసాధారణ నిరుద్యోగం, భరించలేని ధరల పెరుగుదల,  అనియంత్రిత అసమానతలు పెరిగిపోయాయని  విమర్శించారు.   ఈ సుదీర్ఘ పాలనా కాలంలో అనేక చట్టపరమైన,  న్యాయపరమైన సవాళ్లు కూడా ఎదురయ్యాయి. 2002 గుజరాత్ అల్లర్లలో పెద్ద కుట్ర జరిగిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు 2022 జూన్ 24న కొట్టివేస్తూ..  నాటి ముఖ్యమంత్రితో పాటు ఇతరులకు క్లీన్ చిట్ ఇచ్చిన సిట్ నివేదికను సమర్థించింది. అలాగే జాతీయ స్థాయిలో ఆర్టికల్ 370 రద్దు వంటి సంచలన నిర్ణయాలకు సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల విషయంలో దేశవ్యాప్తంగా సుదీర్ఘమైన రైతు ఉద్యమం చెలరేగడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆ చట్టాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుత కాలంలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయడం, మరోవైపు ప్రతిపక్ష కూటమి ఈ అంశంపై   ఆందోళనలు చేపట్టడం రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. ప్రతిపక్షాలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై  ఆరోపణలు గుప్పిస్తుండగా, ఎన్నికల సంఘం ఆ నిందలను తోసిపుచ్చి తమ నిర్ణయాలు పూర్తిగా నిష్పాక్షికంగా ఉన్నాయని స్పష్టం చేసింది.   

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఈ 25 ఏళ్ల పాలనా వేడుకలు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువుగా మారాయి. బీజేపీ,  ఎన్డీయే మిత్రపక్షాలు ఈ కాలాన్ని సేవా సంకల్ప అభియాన్ రూపంలో ఒక నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తుండగా, అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ఆందోళనల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించాయి.

మీడియా,  విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను, మౌలిక వసతుల అభివృద్ధిని ఎంతగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. యువతలో నిరుద్యోగం, తరచూ వెలుగు చూస్తున్న పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థల స్వతంత్రత వంటి అంశాలపై వస్తున్న ప్రజా ఆగ్రహం పాలకులకు  సవాలుగా మారుతోంది.   

నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం దేశంలో బహుమితీయ పేదరికం 2013-14లో 29.17 శాతంగా ఉండగా, 2022-23 నాటికి అది 11.28 శాతానికి పడిపోయింది. దీనివల్ల సుమారు పాతిక కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తి పొందారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో జీడీపీ  2014 నాటికి దాదాపు 2.02 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, 2026 నాటికి అది సుమారు 4.15 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇవన్నీ ఒకవైపు సానుకూల పరిణామాలుగా కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు ఉపాధి కల్పనలో వేగం సరిపోకపోవడం, సామాజిక ఐక్యత,  సంస్థల పనితీరుపై వస్తున్న ప్రశ్నలు పాలనా రికార్డుకు మరో కోణాన్ని తెచ్చిపెడుతున్నాయి. మొత్తంగా చూస్తే, నరేంద్ర మోదీ రెండున్నర దశాబ్దాల ప్రభుత్వ అధినేత ప్రయాణం కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, దేశ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ గతిశీలతను పూర్తిగా మార్చివేసిన ఒక చారిత్రక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Narendra Modi 25 Years Governance, Modi Government Schemes Statistics, Modi Political Milestones India, India Economic Growth, Achievements, Challenges, Telugu One]