జలవిలయం: నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష!
Published on: Fri Aug 28, 2026 12:00PM
.webp)
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వరాష్ట్రానికి చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్వమౌతున్నది. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ పర్యాటకుల క్షేమ సమాచారాలపై మంత్రి నారా లోకేష్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మానససరోవర యాత్రతో పాటు ఆధ్యాత్మిక సందర్శన కోసం నేపాల్ వెళ్లిన మన రాష్ట్రానికి చెందిన పర్యాటకుల పరిస్థితిపై ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు, రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న యాత్రికుల భద్రతను నిర్ధారించడంతో పాటు, వారికి అవసరమైన సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైందన్నారు మంత్రి లోకేష్. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రతినిధులు అందించిన నివేదికల ప్రకారం.. నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో మొత్తం ఏడుగురు ఆంధ్రప్రదేశ్ యాత్రికులు ఉన్నట్లు గుర్తించారు. వారిలో కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో ముగ్గురు యాత్రికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. ప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, ఈషా ఫౌండేషన్ యాత్రా బృందానికి చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మిల ఆచూకీ తెలియాల్సి ఉందని చెప్పారు.
గల్లంతైన ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ చివరగా చైనా సరిహద్దు సమీపంలోని గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్ వద్ద ఉన్నట్లు సమాచారం ఉందని అధికారులు వివరించారు.గల్లంతైన ముగ్గురు యాత్రికులను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. చైనా, నేపాల్ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, గైరోంగ్ చెక్‌పోస్ట్ అధికారులతో పాటు ఈషా ఫౌండేషన్ నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలన్నారు.

ప్రస్తుతం సురక్షితంగా ఉన్న యాత్రికులకు అవసరమైన వైద్యం, ఆహారం, తాత్కాలిక ఆవాస సదుపాయాలు కల్పించి, వారిని సాధ్యమైనంత త్వరగా స్వస్థలాలకు సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మంత్రి లోకేష్ మార్గదర్శకాల మేరకు అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, యాత్రికుల స్థితిగతులను ట్రాక్ చేస్తున్నారు. బాధితుల కుటుంబసభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేంద్ర విదేశాంగ శాఖ సహాయంతో సహాయక చర్యలు వేగవంతం చేశామని లోకేష్ ఈ సందర్భంగా చెప్పారు.
(Nara Lokesh Review on Nepal Floods, AP Pilgrims, Mansarovar Yatra, AP Devotees, AP Delhi Bhavan Rescue, RTGS AP Nepal Rescue)


