TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా వేదికగా 2036 ఒలింపిక్స్: అమరావతికీ భాగస్వామ్యం.. జైషాతో లోకేష్ భేటీ ఇందుకేనా.?

Published on: Fri Sep 25, 2026 11:05AM

ఇండియా వేదికగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.  కాగా ఇందులో భాగంగానే  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కూడా ఆ ఒలింపిక్స్ లో ఒక ప్రముఖ క్రీడా వేదికగా ఎంపిక చేయాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో క్రీడా వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది.  ఇందులో  భాగంగానే  మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్‌లో ఐసీసీ ఛైర్మన్ జై షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న జై షాకు లోకేష్  అభినందనలు తెలిపారు.  రాబోయే లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ క్రీడను చేర్చడంలో జై షా కీలక పాత్ర పోషించడాన్ని  ప్రశంసించారు. అలాగే ఐపీఎల్ మీడియా హక్కుల పరంగా రికార్డు స్థాయి విజయాలను సాధించడంలో  జైషా చొరవను కొనియాడారు. ఈ సమావేశంలో కేవలం అభినందనలు తెలపడమే కాకుండా, రాష్ట్రంలో క్రీడా రంగానికి పెద్దపీట వేసే పలు అంశాలను లోకేష్ జైషా వద్ద ప్రస్తావించారు.  

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపిన నారా లోకేష్.. విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయడం నుంచి, రాష్ట్రంలో జాతీయ స్థాయి, మహిళా క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించడం వరకు పలు అంశాలు ఈ భేటీలో ప్రస్తావించారు. 2036 ఓలింపిక్స్ నిర్వహణకు  ఇండియా  ఎంపికైతే.. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం అయ్యేలా  అవకాశం ఇవ్వాలని కోరారు. ఒలింపిక్స్ లో ఏపీ భాగస్వామ్యం కోసం.. చంద్రబాబు సర్కార్ ఇప్పటి నుంచే  గ్రౌండ్ వర్క్ చేస్తోందనడానికి నారా లోకేష్, జైషా భేటీయే నిదర్శనమని అంటున్నారు.  

గతంలోనూ ఏపీలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం మంత్రి లోకేష్ స్వయంగా చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిని కేవలం  పాలనా కేంద్రంగానే కాకుండా, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పించడం ద్వారా యువతను ప్రోత్సహించాలని భావిస్తోంది. జై షాతో లోకేష్  తాజా భేటీ  రాబోయే రోజుల్లో ఏపీ క్రీడా రంగానికి  ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు. 

భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను నిర్వహించేందుకు ఈ భేటీ   పునాదిగా మారుతుందని చెబుతున్నారు. అమరావతి కేంద్రంగా భవిష్యత్తులో ఒలింపిక్స్ సంబంధిత వేదికల ఏర్పాటుకు లేదా ప్రాథమిక శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ఈ సత్సంబంధాలు దోహదపడతాయని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ ముందస్తు చర్యలు ఆంధ్రప్రదేశ్ క్రీడా చిత్రపటాన్ని పూర్తిగా మార్చేయగలవని క్రీడాభిమానులు  విశ్వసిస్తున్నారు.

[Nara Lokesh Jay Shah meeting, Olympics,  Amaravati, AP sports hub development, Lokesh sports strategy Andhra Pradesh, 2036 Olympics India bid AP, Telugu One]