ఏపీలో మారిటైమ్ రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్: ఇండో-పసిఫిక్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా జువ్వలదిన్నె.!
Published on: Fri Nov 13, 2026 9:55AM

ఆంధ్రప్రదేశ్‌ను అధునాతన రక్షణ, సముద్ర సాంకేతిక పరిజ్ఞానాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు కెప్టెన్ నికుంజ్ పరాశర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటుతో పాటు, సముద్ర రక్షణ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు.
ప్రస్తుతం పూణేలో విజయవంతంగా అమలవుతున్న లిక్విడ్ రోబోటిక్స్ కో-ప్రొడక్షన్ నమూనాను నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె కేంద్రంగా పునరావృతం చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ నికుంజ్ పరాశర్ ను కోరారు. తద్వారా జువ్వలదిన్నెను ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఒక ప్రధాన ఎగుమతి హబ్ అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే.. ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ తిరుపతి, ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని మెరైన్ ఇంజనీరింగ్ విభాగంతో భాగస్వామ్యం కుదుర్చుకుని రాష్ట్రంలో ప్రత్యేక మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాలని కోరారు.
తూర్పు తీర ప్రాంతంలో భద్రత, రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం మానవరహిత నౌకల సీ ట్రయల్స్, నిర్వహణ, మరమ్మతులు, ఫ్లీట్ సపోర్ట్ కార్యకలాపాలకు జువ్వలదిన్నెను కీలక వేదికగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని లోకేష్ ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్దేశించిన సీ-ట్రయల్ ప్రాంతానికి ప్రభుత్వం తరపున అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అనుమతుల పరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని వివిధ రంగాలలో సాగర్ డిఫెన్స్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలపై కూడా ఆయన కీలక ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ పరిధిలోని ఓడరేవులలో హార్బర్ భద్రత, హైడ్రోగ్రాఫిక్ సర్వేల నిర్వహణ కోసం మానవరహిత నౌకల పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలనీ, కేజీ బేసిన్‌లోని చమురు, సహజవాయువు సంస్థల ఆఫ్ షోర్ తనిఖీల కోసం, విపత్తుల సమయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి తుఫాను, వరద సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: ఐసీసీ సదస్సు వేదికగా పవన్ తో లోకేష్ భేటీ: రాష్ట్ర పారిశ్రామిక పురోగతిపై చర్చ.!
పారిశ్రామిక విస్తరణలో భాగంగా ఎండ్యూర్ ఎయిర్, సాగర్ యూఏవీ ఉత్పత్తి విభాగాలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలనీ, వీటికి అవసరమైన కాంపోజిట్స్, బ్యాటరీలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్స్ వంటి విడిభాగాలను అందించే టైర్ 2 స్థాయి సరఫరాదారులను నెల్లూరు ప్రాంతానికి తరలించాలనీ కోరారు. దీనివల్ల స్థానికంగా పూర్తిస్థాయి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. జువ్వలదిన్నె పరిసర ప్రాంతాలలోని మత్స్యకార కుటుంబాలకు ఉద్యోగ కల్పనలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి కోసం ఆధునిక స్మార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ నెట్‌వర్క్ త్వరితగతిన అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి ప్రతిపాదనలపై సాగర్ డిఫెన్స్ ఫౌండర్ కెప్టెన్ నికుంజ్ పరాశర్ సానుకూలంగా స్పందించారు. బోయింగ్ అనుబంధ సంస్థ అయిన లిక్విడ్ రోబోటిక్స్‌తో పాటు, ఏరియల్ రోబోటిక్స్ రంగంలో పేరొందిన ఎండ్యూర్ ఎయిర్ సిస్టమ్స్‌లో తమ సంస్థ ఇప్పటికే వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టినట్లు వివరించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుంచిన తాజా ప్రతిపాదనలు ఆశాజనకంగా ఉన్నాయని, వీటి సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సాగర్ డిఫెన్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో అడుగుపెడితే, అత్యాధునిక సముద్ర సాంకేతికత అందుబాటులోకి రావడమే కాకుండా, స్థానిక యువతకు మరియు మత్స్యకార వర్గాలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
మీకు నచ్చవచ్చు: విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!
ఏపీ పెట్టుబడులకు యూఏఈ ఆసక్తి..12 సంస్థలతో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్.!
[Nara Lokesh, Sagar Defence, NikunjParashar, Juvvaladinne, Exporthub, TeluguOne]


