TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Pan IIT Summit: ఏపీని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : నారా లోకేష్

Published on: Sat Oct 3, 2026 8:21PM

పాన్ ఐఐటీ సమ్మిట్‌–2026లో మంత్రి కీలక వ్యాఖ్యలు.! 

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలోనే సరికొత్త అభివృద్ధి, మార్పు, సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్‌ను వేదికగా నిలపాలన్న లక్ష్యంతో తమ బృందం పనిచేస్తోందని తెలిపారు. పాన్ ఐఐటీ సమ్మిట్‌–2026లో పాల్గొన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞమైన నాయకత్వానికి యువతతో కూడిన డైనమిక్ టీమ్ తోడైందని లోకేష్ పేర్కొన్నారు. అనుభవం, యువశక్తి కలయిక రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక బలమని చెప్పారు. అమెరికా, యూరప్ దేశాలు అభివృద్ధి చెందిన స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టగా.. దుబాయ్, సింగపూర్ వంటి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి సాధించాయని గుర్తుచేశారు. 

 

భారత్‌కు కూడా వచ్చే దశాబ్దం ‘గోల్డెన్ డికేడ్’గా మారాలంటే స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ కీలకమని వివరించారు.కేవలం అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) చేసుకోవడమే కాకుండా.. వాటిని ఆచరణలోకి తీసుకొచ్చి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలను సృష్టించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. పరిశ్రమదారులను జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నామని, వారి భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన విధానాలను రూపొందిస్తామని తెలిపారు. రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే పాలసీల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను కూడా వినియోగిస్తున్నామని వెల్లడించారు. హార్టికల్చర్, స్టీల్, డేటా సెంటర్లు, క్వాంటం టెక్నాలజీ, అంతరిక్షం, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా రాష్ట్రంలో అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 


మదనపల్లిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుతో ఉద్యానవన రంగంలో పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ఆర్సెలర్ మిట్టల్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రంలో పెట్టుబడుల వేగానికి నిదర్శనమని పేర్కొన్నారు.హార్టికల్చర్ నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు మొత్తం 23 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ వెల్లడించారు. వ్యవసాయం, ఫార్మా, ఆటోమొబైల్, సోలార్, పునరుత్పాదక ఇంధనం, స్పేస్, డ్రోన్లు, గ్లాస్ తదితర రంగాల్లో ప్రత్యేక పారిశ్రామిక వ్యవస్థలను నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 4.8 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచామని, ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవడానికి మరింత వేగంగా ముందుకు సాగాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న క్లస్టర్ల అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు తమ పరిజ్ఞానం, అనుభవం, అంతర్జాతీయ పరిచయాలు, మార్గదర్శకత్వాన్ని అందించాలని లోకేష్ కోరారు. విద్య, పరిశోధన, పరిశ్రమలను అనుసంధానించడం ద్వారా నూతన ఆవిష్కరణలకు, ఉపాధి అవకాశాలకు బాటలు వేయవచ్చన్నారు.


 తాత్కాలిక పరిష్కారాలపై ఆధారపడే విధానం నుంచి సంస్థాగత సామర్థ్యం, వేగవంతమైన అమలు దిశగా రాష్ట్రం అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అమరావతిని ఆధునిక నగరంగా, విద్యా, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. సుమారు 5 వేల ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందని, ఇది అమరావతి భవిష్యత్తు అభివృద్ధికి కీలకంగా మారుతుందని చెప్పారు. భోగాపురం విమానాశ్రయాన్ని కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మిస్తున్నామని వెల్లడించారు.ఇతర దేశాల అభివృద్ధి నమూనాలను అనుసరించడానికే పరిమితం కాకుండా.. ప్రపంచానికి సొంత అభివృద్ధి నమూనాను అందించే స్థాయికి భారత్ ఎదగాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పాన్ ఐఐటీ కమ్యూనిటీ తమ పరిజ్ఞానం, అనుభవం, సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 


[ Nara Lokesh, Andhra Pradesh Development, Pan IIT Summit 2026, Developed Andhra Pradesh, Chandrababu Naidu, Viksit Bharat, Andhra Pradesh Investments, Industrial Development, Greenfield Steel Plant, Google Data Center, Quantum Technology, Horticulture, Renewable Energy, Amaravati Development ]