ఉండవల్లి నివాసం వద్ద 53 దీపాలు వెలిగించిన లోకేష్.. ఎందుకో తెలుసా?
Published on: Thu Sep 10, 2026 9:03AM

జగన్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన సంఘటనకు సెప్టెంబర్ 9 తో మూడేళ్లు పూర్తయ్యాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ గతంలో జరిగిన ఈ పరిణామాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా కొన్ని కొన్ని ఫొటోలను షేర్ చేశారు.
జగన్ హయాంలో చంద్రబాబును అక్రమంగా నిర్బంధంలో ఉంచిన కాలాన్ని స్మరిస్తూ.. సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో ఉంచారనీ.. ఆ చీకటి రోజును, అన్యాయాన్ని నిరసిస్తూ తాము ఎప్పుడూ న్యాయం వైపే నిలబడ్డామని ఆయన పేర్కొన్నారు. సత్యమేవ జయతే అనే నినాదంతో, తన తండ్రి జైలులో గడిపిన ప్రతి రోజూ గుర్తుకు వచ్చేలా ఉండవల్లిలోని అధికారిక నివాసంలో 53 మట్టి దీపాలను వెలిగించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఐదు దశాబ్దాలకు పైగా ఎలాంటి మచ్చలేని ప్రజా జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు స్వచ్ఛమైన నాయకుడనిపేర్కొన్న లోకేష్.. ఆయనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎన్ని అబద్ధపు ఆరోపణలుచేసినా, ఎన్ని అక్రమ కేసులు మోపినా, ప్రజల ఆశీస్సులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల మద్దతుతో ఆయన బయటకు వచ్చారని ఉద్ఘాటించారు. కేవలం ఉండవల్లి నివాసంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లోనూ తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఈ 53 రోజుల నిర్బంధాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు, దీపోత్సవాలు నిర్వహించారు.
గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు పేరుతో చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సీనియర్ నేతలు, శ్రేణులు ఎక్కడికక్కడ నిర్బంధాలను ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ నాయకత్వం ధైర్యంగా నిలబడింది. ఆ సమయంలో లోకేష్ పార్టీ శ్రేణులకు అండగా నిలవడంతో పాటు, ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రధాన చర్చనీయాంశంగా మార్చడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు మూడేళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. గత ప్రభుత్వ అరాచకాలను, కక్షసాధింపు రాజకీయాలను ప్రజలకు మరోసారి గుర్తుచేసేలా ఈ కార్యక్రమం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Nara Lokesh, Chandrababu Naidu arrest anniversary, Undavalli residence, 53 earthen lamps, TDP updates, Andhra Pradesh politics]


