TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంగళగిరిలో మోడరన్ రైతు బజార్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..!

Published on: Thu Aug 27, 2026 2:48PM

 

మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. స్థానిక రైతులు, వ్యాపారులు, సాధారణ వినియోగదారుల సంక్షేమమే ధ్యేయంగా మంగళగిరి పట్టణంలో రూ.18.55 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక 'మోడరన్ రైతు బజార్' నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గురువారం భూమిపూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్టును మంగళగిరి పరిధిలోని నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో సుమారు 5.90 ఎకరాల విస్తాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఈ సమగ్ర మార్కెట్ నిర్మాణానికి అవసరమైన పూర్తి ఆర్థిక సహకారాన్ని అందిస్తుండటం విశేషం. పటిష్టమైన ప్రణాళికతో రూపుదిద్దుకుంటున్న ఈ నమూనా మంగళగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ నూతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను మొత్తం 71,925 చదరపు అడుగుల వివిద విస్తీర్ణంలో నిర్మించేలా డిజైన్ చేశారు. ఇందులో రిటైల్ మరియు హోల్ సేల్ విభాగాలను వేర్వేరుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాపారులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విశాలమైన ప్రాంగణంలో ప్రతి చిన్న సదుపాయాన్ని పొందుపరిచారు.

వివరాల్లోకి వెళితే, రిటైల్ విభాగంలో సాధారణ కూరగాయల అమ్మకాల కోసం 102 ప్రత్యేక స్టాళ్లతో పాటు పండ్లు, తాజా పూల విక్రయదారుల కోసం మరొక 54 స్టాళ్లను కేటాయించారు. అలాగే హోల్ సేల్ వ్యాపార కార్యకలాపాల కోసం 23 దుకాణాలను, సరుకులను సులువుగా దిగుమతి చేసుకునేందుకు వీలుగా 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించనున్నారు.

కేవలం విక్రయ ప్రాంగణంగానే కాకుండా, సరుకులు పాడవకుండా భద్రపరుచుకోవడానికి అత్యాధునిక కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని, కూరగాయలను శుభ్రపరిచే వాషింగ్ ప్లాంట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు విచ్చేసే వినియోగదారులు, రైతుల కోసం క్యాంటీన్ మరియు విశాలమైన వాహన పార్కింగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం మంత్రి, మార్కెట్ నమూనా మ్యాప్‌ను నిశితంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఈ స్థాయి హైటెక్ మార్కెట్ రావడం పట్ల స్థానిక ప్రజలు మరియు రైతు వర్గాలు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనలో మంగళగిరిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ఇటువంటి మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రూపుదిద్దుకోనున్నాయి.

 

Nara Lokesh, Mangalagiri Modern Rythu Bazar, AP News, Mangalagiri Development, Aurobindo Pharma Foundation, TeluguOne News