Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...షైనింగ్ స్టార్లే మా బ్రాండ్ అంబాసిడర్లు : మంత్రి లోకేష్
posted on: Jun 29, 2026 6:42PM
.webp)
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
వచ్చే ఏడాది మరో రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే రాష్ట్రానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.
తాడేపల్లిలోని సీఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘షైనింగ్ స్టార్స్’ సత్కార కార్యక్రమంలో గత ఏడాది పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు. 55 మంది పదో తరగతి విద్యార్థులకు రూ.30 వేల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ అందజేయగా, 61 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, మెడల్స్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మీరు గెలిచారు... నన్ను గెలిపించారు. మన విద్యావ్యవస్థను గెలిపించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు” అని అభినందించారు. విద్యాశాఖ వ్యవసాయం లాంటిదని, ఫలితాలు ఒక్కరోజులో రావని, నిరంతర కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్‌లాండ్‌కు పంపిస్తూ అక్కడి అత్యుత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి ఏపీలో అమలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా “ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్” గురించి చర్చ జరిగేలా పనిచేస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, గతంలో చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం సిఫారసులు కోరే పరిస్థితి వచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఆ విజయానికి షైనింగ్ స్టార్స్‌నే కారణమని అన్నారు.
విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు అన్నీ విద్యార్థి కేంద్రంగానే రూపుదిద్దుకున్నాయని తెలిపారు. వన్ క్లాస్–వన్ టీచర్ విధానం, లీప్ మిషన్, లీప్ యాప్, స్టూడెంట్ కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, సెంట్రలైజ్డ్ కిచెన్లు, నో బ్యాగ్ డే, క్లిక్కర్ టెక్నాలజీ, త్వరలో ఏఐ ట్యూటర్ ప్రవేశపెట్టడం వంటి చర్యలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు.
గత ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 72.8 నుంచి 78.39 శాతానికి పెరిగిందని వెల్లడించారు. విద్య అనేది జీవితంలో అత్యుత్తమ పెట్టుబడిగా అభివర్ణించిన లోకేష్, విద్యార్థులు తమ పాఠశాలలను ఎప్పటికీ మర్చిపోవద్దని, భవిష్యత్తులో అవకాశాలు వచ్చినప్పుడు తమ చదువుకున్న విద్యాసంస్థలకు సహాయం చేయాలని సూచించారు.
పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేసిన మంత్రి, పాఠ్యపుస్తకాల నుంచి రాజకీయ ప్రచార అంశాలను తొలగించామని తెలిపారు. విలువలతో కూడిన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళల పట్ల గౌరవ భావన చిన్ననాటి నుంచే అలవర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.






