TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు.!

Published on: Thu Oct 1, 2026 9:52PM

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది. మరో నెల రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక సూచనలు చేశారు.డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు అందించే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ఉపాధ్యాయ నియామక విధానాన్ని దేశవ్యాప్తంగా పరిశీలిస్తున్నారని, రాష్ట్ర విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం ఉందని తెలిపారు.

పదో తరగతి ఫలితాలే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’.!

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని లోకేష్ ఆదేశించారు. విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మెరుగైన ఫలితాల సాధనకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

డ్రాప్‌అవుట్స్ నివారణకు ప్రత్యేక కార్యాచరణ.!

పాఠశాల విద్యకు దూరమవుతున్న పిల్లల సమస్యపై కూడా సమీక్షలో చర్చించారు. స్కూల్ డ్రాప్‌అవుట్స్ భవిష్యత్తులో డ్రగ్స్ వినియోగం సహా పలు సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన సింగపూర్ హోం మంత్రి షణ్ముగం చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. పిల్లలు చదువుకు దూరం కాకుండా కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేస్తూ ‘జీరో డ్రాప్ అవుట్ మిషన్’ చేపట్టాలని సూచించారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా ఇప్పటికే ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు పాఠశాలను సందర్శించేందుకు సింగపూర్ మంత్రి షణ్ముగంను త్వరలో ఆహ్వానిస్తామని వెల్లడించారు.

175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్‌’గా అభివృద్ధి.!

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసి, మొత్తం 175 పాఠశాలలను ‘లీప్ స్కూల్స్‌’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు.!

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. ఈ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని ఉన్నత విద్య డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. డిసెంబర్‌లో రాత పరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రముఖ వర్సిటీల ఆసక్తి.!

ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు జేఎస్ఎస్ యూనివర్సిటీ, థాపర్ యూనివర్సిటీ, యూపీఈఎస్, జేయూఎస్ యూనివర్సిటీ, బెన్నెట్ యూనివర్సిటీ, సవిత యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించాలని మంత్రి సూచించారు. నిర్మాణ పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో అమలవుతున్న ‘సాల్ట్’ (Supporting Andhra's Learning Transformation) కార్యక్రమంపై కూడా మంత్రి సమీక్ష నిర్వహించారు. తొలి దశ కార్యక్రమం డిసెంబర్ నాటికి పూర్తికానున్న నేపథ్యంలో రెండో దశ అమలుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటును వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. తొలిదశలో 21 ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన కౌన్సిలర్లను గుర్తించినట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆటిజం, భవిత సెంటర్లు సాధ్యమైనంత వరకు ఒకే ప్రాంతంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ నెలాఖరులోగా 14 సెంటర్ల సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు.

విశాఖలో ప్రతిష్టాత్మక గ్రంథాలయం.!

ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక గ్రంథాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పబ్లిక్ లైబ్రరీ శాఖ భాగస్వామ్యంతో నిర్మించనున్న ఈ గ్రంథాలయానికి సంబంధించి రూపొందించిన పలు నమూనాలను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు.

 

 

 

[ Nara Lokesh, AP DSC 2.0 Notification, DSC Recruitment 2026, Andhra Pradesh Education Department, Mission March, Class 10 Public Exams, Zero Dropout Mission, Leap Schools, Teacher Recruitment, AP Education News ]