TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఈవో సీఎం నుంచి వాటర్ మ్యాన్ సీఎంగా చంద్రబాబు పొలిటికల్ జర్నీ.!

Published on: Thu Sep 10, 2026 2:50PM

ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు దశాబ్దాల పొలిటికల్ జర్నీలో  కీలక  పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌పై హైదరాబాద్‌ను నిలబెట్టి  సీఈఓ సీఎం గా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్  వాటర్ మ్యాన్ సీఎంగా ప్రశంలు అందుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా సాగునీటి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం ద్వారా ఆయన కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కరవును తరిమికొట్టడం, వలసలను అరికట్టడం,  రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఆయన వేస్తున్న అడుగులు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్న పేరుకు సార్థకత చేకూర్చేలా ఉన్నాయి.  

పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం ద్వారా చంద్రబాబు  తన పొలిటికల్ కెరీర్ లో మరో మైలు రాయిని అధిగమించారు. పోలవరం ఎడమకాలువ ద్వారా నీటి విడుదలకు కొద్ది రోజుల ముందు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ మొదటి దశను కూడా ఆయన ప్రారంభించారు.  వారం వ్యవధిలో  రెండు భారీ సాగునీటి ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం ద్వారా  వాటర్ మ్యాన్ సీఎంగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 

చంద్రబాబు తన రాజకీయ ప్రయాణంలో సాగునీటి రంగానికి ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఆయన తొలి ప్రయోగం ఎలాంటి భారీ డ్యామ్‌తో ప్రారంభం కాలేదు, తన సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే మొదలైంది. 1990లలో ఆయన బిందు సేద్యం, ఉద్యాన పంటలు,  డెయిరీ రంగానికి విశేష ప్రోత్సాహం అందించారు. వర్షాధార వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడిన రైతులకు ఇజ్రాయెల్ సాంకేతికతను పరిచయం చేశారు. ఈ విధానం ద్వారా దాదాపు 30 నుంచి 50 శాతం నీరు ఆదా కావడంతో పాటు దిగుబడి గణనీయంగా పెరిగింది. దీనివల్ల సెరికల్చర్, పౌల్ట్రీ, డెయిరీ రంగాలు  పుంజుకుని, వ్యవసాయం  ఉపాధి మార్గంగా మారింది.  

 ప్రస్తుతం  ఆయన పాత ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను బాగు చేయడం  కచ్చితమైన గడువులను విధించడం ద్వారా సాగునీటి రంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు.   .35 వేల 555 కోట్ల అంచనా వ్యయంతో కూడిన 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను గుర్తించి, 2026 నుంచి 2028 మధ్య వాటిని పూర్తి చేయడానికి నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించిన చంద్రబాబు.. కేవలం భారీ నిర్మాణాలకే పరిమితం కాకుండా,  జలధార-జల హారతి కింద  82 వేలకు పైగా నీటి సంరక్షణ పనులను చేపట్టింది. ట్యాంకులు, కాలువలు, చెక్ డ్యామ్‌లు, ఫార్మ్ పాండ్‌లను బాగు చేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించారు.

చంద్రబాబు జల వ్యూహంలో కీలకమైన, కేంద్ర బిందువు అయిన పోలవరం ప్రాజెక్టు పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి.  మార్చి 2027 నాటికి ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు   రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నీటితోనే  ముడిపడి ఉంటాయని నమ్ముతారు.  
మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలో దేశంలోనే   టెక్నాలజీ అనుకూల సీఎంగా, ఏపీ సీఎంగా కాకుండా సీఈఓగా గుర్తింపు పొందిన చంద్రబాబు.. ఇప్పుడు తనను తాను  'వాటర్ మ్యాన్'ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ఆవిష్కరించుకుంటున్నారు.  రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా కార్యరూపం దాలిస్తే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ స్వరూపమే పూర్తిగా మారిపోతుందని నిపుణులు అంటున్నారు. రాయలసీమతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలన్నింటికీ సాగు, తాగునీరు అందడం ద్వారా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు.  

[Nara Chandrababu Naidu, Andhra Pradesh Irrigation, Polavaram Project, Veligonda Project, TeluguOne News, AP Politics, CBN Waterman]