900 కోట్ల రూపాయలతో నల్గొండ రింగ్ రోడ్డు.. మంత్రి కోమటిరెడ్డి.!
Published on: Tue Sep 22, 2026 4:00PM

నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి, సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పట్టణ ప్రజలకు అత్యుత్తమ పౌర సేవలను అందించడంతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్న ఆయన.. నల్గొండ పట్టణ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిందని వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు వేగవంతం చేశామన్నారు.
ఇందులో భాగంగా సుమారు నూటపాతిక కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఈ తాగునీటి సరఫరా ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. నల్గొండ పట్టణాభివృద్ధిలో భాగంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పిన ఆయన.. 900 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదే విధంగా పట్టణంలోని ప్రధాన రహదారుల విస్తరణ, అంతర్గత సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ వంటి కీలక నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ పనులన్నీ పూర్తయితే నల్గొండ ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయి సరికొత్త రూపు సంతరించుకుంటుందని కోమటిరెడ్డి వివరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఎస్‌ఎల్‌బీసీ టెన్నెల్ పనులకు అవసరమైన నిధులను సమీకరిస్తున్నానట్లు చెప్పిన కోమటిరెడ్డి.. ఈ పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని వివరించారు. దీనివల్ల జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందడంతో పాటు తాగునీటి అవసరాలు కూడా పూర్తిగా తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
[Nalgonda Ring Road, Nalgonda Smart City, Komatireddy Venkat Reddy, Telangana Development, Nalgonda, Telangana News, Telugu One]


