మయన్మార్‌లో బౌద్ధ మఠంపై వైమానిక దాడి.. 14 మంది మృతి..!
Published on: Fri Aug 21, 2026 9:19PM

మయన్మార్‌లో సైనిక పాలకుల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. దేశంలో శాంతియుతంగా ధ్యానం చేసుకుంటున్న పౌరులపై మిలిటరీ జుంటా దారుణానికి ఒడిగట్టింది. బౌద్ధ మఠమే లక్ష్యంగా వైమానిక దాడులు జరపడంతో 14 మంది అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సంఘటన సెంట్రల్ మయన్మార్‌లోని సగియాంగ్ ప్రాంతం, మ్యాంగ్ టౌన్‌షిప్‌లోని స్వెల్ లే ఓహ్ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం స్థానిక సమయం ప్రకారం 9 గంటల ప్రాంతంలో ఈ భయానక దాడి జరిగింది. ఆ సమయంలో సదరు బౌద్ధ మఠంలో దాదాపు 100 మందికి పైగా భక్తులు వారం రోజుల ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఉన్నట్టుండి విరుచుకుపడిన సైనిక యుద్ధ విమానం మఠం కాంపౌండ్‌పై బాంబులను జారవిడిచింది.15 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు బాంబు దాడులు జరపడంతో ప్రార్థనా మందిరంతో పాటు పక్కనే ఉన్న భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడిలో ముగ్గురు మహిళలతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాడి జరిగిన వెంటనే స్థానిక నివాసితులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం, తదుపరి దాడుల భయంతో గ్రామస్తులంతా సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. సగియాంగ్ ప్రాంతం ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడుతున్న ప్రతిఘటన దళాలకు పట్టున్న ప్రాంతం కావడంతోనే సైన్యం ఇక్కడ వరుస దాడులకు పాల్పడుతోందని స్థానిక వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 2021 ఫిబ్రవరిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆంగ్ సాన్ సూకీతో సహా పలువురు నేతలను జైలులో పెట్టిన నాటి నుంచి మయన్మార్ మిలిటరీ సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఇప్పటికే పాఠశాలలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై దాడులు జరిపిన సైన్యం, ఇప్పుడు పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలపై కూడా బాంబుల వర్షం కురిపించడాన్ని ప్రపంచదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మిలిటరీ పాలనపై ప్రజల నుంచి తిరుగుబాటు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Myanmar Military Airstrike, Sagaing Monastery Attack, Myanmar News Telugu, Buddhist Monastery Strike,Myanmar Military Junta


