నాదర్గుల్ దాండియా వేడుకలో విషాదం.. ముగ్గురు అరెస్ట్.!
Published on: Tue Oct 20, 2026 7:05PM

హైదరాబాదు నగరంలోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో దాండియా వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్న సమయంలో లైటింగ్ పోల్ కూలిపడటంతో సోనీ నారాయణ దాస్ అనే విద్యార్థిని మృతి చెందగా, మరో 22 మంది విద్యార్థులు గాయపడిన ఘటన అందరికీ తెలిసిందే... అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఈ మేరకు శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో లైటింగ్ పోల్‌కు సరైన సపోర్టు ఏర్పాటు చేయకపోవడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి, ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన క్రియా ఈవెంట్ ఆర్గనైజర్, వయూరా ఎక్స్పీరియన్స్, పీఎస్ లైటింగ్ అండ్ సౌండ్స్‌కు చెందిన నిర్వాహకుల పాత్రపై విచారణ చేపట్టాము. ఈ క్రమంలో మల్లెల సాకేత్, బత్తుల పునీత్, సాయం విశాంత్లను అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఏడుగురిని నిందితులుగా గుర్తించినట్లు డిసిపి వెల్లడించారు.

ఈవెంట్ నిర్వాహకులకు చెందిన ధనుష్, మహేష్ పరారీలో ఉన్నట్లు డిసిపి తెలిపారు. కళాశాల తరఫున కోఆర్డినేటర్లుగా వ్యవహరించిన అఖిల్, కారే రాజేష్, హనుమంతరావు పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు డీసీపీ తెలిపారు. అయితే పరారీలో ఉన్నవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు డిసిపి వెల్లడించారు. దాండియా వేడుకల కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ పోల్‌కు తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన సపోర్టు లేకపోవడం వల్లే అది కూలిపోయినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు డీసీపీ రాజేష్ తెలిపారు. విద్యార్థులు వేడుకల్లో పాల్గొంటున్న సమయంలో పోల్ కూలిపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ప్రమాదంలో సోనీ నారాయణ దాస్ ప్రాణాలు కోల్పోగా, మరో 22 మంది గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను యశోద, కామినేని, ప్రత్యూష ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినట్లు డిసిపి తెలిపారు. ఘటనకు సంబంధించి ఎంవీఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశామన్నారు.కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ ప్రమాదంపై ఆదిభట్ల పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 105, 125(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.విద్యార్థుల భద్రతకు సంబంధించిన అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కళాశాలల్లో నిర్వహించే వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా త్వరలోనే ఆయా కళాశాలల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు డీసీపీ రాజేష్ తెలిపారు.
[ MVSR Engineering College, Nadergul Dandiya Accident, Hyderabad Dandiya Tragedy, Three Arrested, Sony Narayana Das, Shamshabad DCP Rajesh, Lighting Pole Collapse, Dandiya Event Accident, Student Death, College Management Case, Student Safety, Hyderabad Crime News, Telangana Police Investigation ]


