Hyderabad: దాండియా ఈవెంట్లో ఘోర ప్రమాదం.. లైటింగ్ పోల్ కూలి ఇద్దరు విద్యార్థులు మృతి.!
Published on: Sun Oct 18, 2026 11:43AM

పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. అంతలోనే ఊహించని ప్రమాదం ఆ ఆనందాన్ని ఆవిరి చేసింది. క్షణాల వ్యవధిలోనే సంతోషాల మధ్య మృత్యువు చొరబడింది. పండుగ సంబరాలు విషాదంగా మారాయి. చివరకు ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైదరాబాద్ శివారులోని నాదర్గుల్లో ఉన్న ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన దాండియా వేడుకల్లో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థినీ విద్యార్థులంతా ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. అంతా సంతోషంగా సాగుతున్న సమయంలో ఒక్కసారిగా లైటింగ్ పోల్ కూలి విద్యార్థులపై పడింది. దీంతో అక్కడున్న వారిలో పలువురు గాయపడ్డారు. అదే సమయంలో మంటలు చెలరేగడంతో కళాశాల ప్రాంగణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన సోనీ అనే విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎంతో ఉత్సాహంగా పండుగలో పాల్గొన్న విద్యార్థులు ఇలా ప్రమాదానికి గురికావడం తోటి విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. సోనీ సోదరితో పాటు మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రమాదంలో సుమారు 25 మంది విద్యార్థినులకు గాయాలయ్యాయి..తల, చేతులు, కాళ్లు, మెడ భాగాల్లో గాయాల య్యాయి.. ఈ ప్రమాదంలో సోనీ వనపర్తి చెందిన విద్యార్థిని మృతి చెందింది.. సోనీ చౌదరి తో పాటు మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారందరినీ కామినేని ఆసుపత్రికి తరలించారు..మిగతా బాధితులకు ప్రత్యూష ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు..కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణ మంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...గాయపడిన విద్యార్థినులందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రమాదం జరిగి విద్యార్థి మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.విద్యార్థి కుటుంబానికి సీఎం సంతాపం తెలిపారు.. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు...ప్రమాదానికి బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పండుగ వేళ తమ పిల్లలు సంతోషంగా గడుపుతున్నారని భావించిన తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. కొద్దిసేపటి క్రితం వరకు స్నేహితులతో కలిసి నవ్వుతూ, నృత్యాలు చేసిన విద్యార్థులు.. ఒక్కసారిగా ప్రమాదం బారిన పడటంతో కళాశాల ప్రాంగణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, అసలు లైటింగ్ పోల్ ఎందుకు కూలింది? మంటలు ఎలా చెలరేగాయి? వేడుకల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరిపితేనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పండుగ సంబరాల మధ్య చోటుచేసుకున్న ఈ విషాదం.. విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపిన ఈ ఘటనపై పూర్తి వివరాలు, గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
[ MVSR Engineering College, Dandiya Event Accident, Dandiya Tragedy, Student Deaths, Lighting Pole Collapse, Batukamma Celebrations, Nadargul Accident, Hyderabad News, Telangana News, College Event Accident, Students Injured, Kamineni Hospital, Fire Accident, Campus Safety, Breaking News ]


