మాంసాహార ప్రియుల కోసం స్పెషల్ మటన్ కారప్పొడి రెసిపీ!
Published on: Mon Sep 7, 2026 11:19AM

రొటీన్ వంటకాలతో విసిగిపోయి, నోరు కట్టేసినట్లు అనిపించినప్పుడు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని నోరూరించే కారప్పొడి తింటే ఆ తృప్తే వేరు. సాధారణంగా మనం ఇళ్లల్లో కందిపప్పు కారం, కొబ్బరి కారం, పల్లీల పొడి లేదా నల్లకారం వంటి శాకాహార కారప్పొడులు తరచుగా చేసుకుని తింటుంటాం. అయితే మాంసాహార ప్రియుల కోసం బోన్‌లెస్ మటన్‌తో అద్భుతమైన రుచిని ఇచ్చే మటన్ కారం పొడి తయారు చేసుకోవచ్చు. ఈ కారప్పొడి వేడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా అద్భుతమైన రుచిని అందిస్తుంది. సరిగ్గా తయారుచేసుకుంటే ఇది పది నుంచి పదిహేను రోజుల పాటు నిల్వ ఉండి ఎంతో రుచికరంగా ఉంటుంది.
ఈ ఘాటైన మటన్ కారం పొడి తయారీకి కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ 250 గ్రాములు (పావు కిలో), ఎండుమిర్చి 20, ధనియాలు 2 ,టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1, టేబుల్ స్పూన్, మినపప్పు 1, టేబుల్ స్పూన్, శనగపప్పు 1, టేబుల్ స్పూన్, అల్లం 1, అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు 12 ,నుండి 15, కరివేపాకు 2, నుండి 3 రెమ్మలు, పసుపు , అర టీస్పూన్, ఉప్పు , రుచికి సరిపడా, మరియు నూనె 2, నుండి 3 టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం చాలా సులువు. ముందుగా బోన్‌లెస్ మటన్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక పాత్రలో లేదా బాణలిలో ఈ మటన్ ముక్కలను వేసి అందులో పసుపు, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు లేదా పేస్ట్ వేసి బాగా కలిపి మూతపెట్టి ఉడికించాలి. మటన్ నుండి వచ్చే నీరంతా పూర్తిగా ఇంకిపోయే వరకు చిన్న మంటపై బాగా ఉడకనివ్వాలి. నీరు పూర్తిగా ఇంకిపోయాక, 1 నిమిషం పాటు ఆరనిచ్చి, తగినంత నూనె వేసి మటన్ ముక్కలు మంచి క్రిస్పీగా, ఎర్రగా మారే వరకు దోరగా వేయించాలి. మటన్ ముక్కలు ఎంత క్రిస్పీగా వేగితే కారప్పొడి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. వేగిన ముక్కలను వేరే పళ్లెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే బాణలిలో ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసి దోరగా వేయించాలి. సువాసన వచ్చే వరకు వేయించిన ఈ దినుసులను చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత ముందుగా వేయించిన దినుసులను, వెల్లుల్లి రేకలను మిక్సీ జార్‌లో వేసి కారంగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్న క్రిస్పీ మటన్ ముక్కలను కూడా అందులో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే, రుచికరమైన మటన్ కారం పొడి సిద్ధమవుతుంది. దీనిని గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుంటే పది నుంచి పదిహేను రోజుల పాటు తాజాదనంతో ఉంటుంది.
Mutton karam podi ingredients process, tasty non veg karam podi Telugu.


