TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అరకు కాఫీ తరువాత ముసునూరు పాప్‌కార్న్.!

Published on: Tue Aug 25, 2026 11:33AM

ఏపీలో  ఫుడ్ ప్రాసెసింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. రికార్డులు తిరగరాస్తోంది.  ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  అరకు కాఫీ తరహాలోనే, ఇప్పుడు ముసునూరు పాప్‌కార్న్  ఆ స్థాయి గుర్తింపు దిశగా ముందుకు సాగుతోంది. ఏలూరు జిల్లా   ముసునూరు వేదికగా దేశంలోనే మొట్టమొదటి నాన్ జీఎంఓ  మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని   విడుదల చేశారు. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానిస్తూ..  రైతులకు నాణ్యమైన విత్తనాలతో పాటు స్థిరమైన ఆదాయ మార్గాలను చూపే ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో ఒక కీలక మైలురాయి కానుంది. 

ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ముసునూరులోని  గుర్మెట్ పాప్‌కార్నిక  ప్రాంగణంలో సోమవారం (ఆగస్టు 24)  జరిగింది.  ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాలను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడంలో ఈ ఘట్టం  ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికాకు చెందిన   ప్రిఫర్డ్ పాప్‌కార్న్ సంస్థతో పాటు భారత్‌కు చెందిన  గుర్మెట్ పాప్‌కార్నిక  సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఈ ఉమ్మడి ప్రాజెక్టు ద్వారా ఆసియా ఖండంలోనే   అత్యాధునిక పాప్‌కార్న్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు అయ్యింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిన ఈ సాంకేతికత ద్వారా స్థానిక రైతులు పండించే పంటకు గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ లభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది కేవలం ఒక్క ప్రాసెసింగ్ కేంద్రానికే పరిమితం కాకుండా..  విత్తనాభివృద్ధి నుండి విక్రయాల వరకు సమగ్రమైన నెట్‌వర్క్‌ను రూపొందిస్తోంది.

ఈ సందర్భంగా సీఎం  చంద్రబాబు నాయుడు గుర్మెట్ పాప్‌కార్నిక  సంస్థతో  ఎంవోయూ కుదుర్చుకున్న ముసునూరు ప్రాంత మొక్కజొన్న రైతులకు ఇకపై ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకే పరిమితం కాకుండా..  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార శుద్ధి రంగానికి రైతులను అనుసంధానించడమే ఈ ప్రాజెక్ట్   లక్ష్యమన్నారు.  

ప్రాథమిక దిగుబడి పరీక్షలు, విత్తనాల నాణ్యతా విశ్లేషణ, పంటకోత పద్ధతులు, క్రాప్ బ్రీడింగ్ విధానాలు వంటి పలు సంక్లిష్ట ప్రక్రియలను ఎంతో పారదర్శకంగా ప్రదర్శించారు. విత్తన నాణ్యతతో పాటు ప్రాసెసింగ్ సమయంలో గింజలు గరిష్ట స్థాయిలో ఉబ్బేలా (High Expansion) సరికొత్త రకాలను అందుబాటులోకి తేవడమే ఈ పరిశోధనల ప్రధాన ఉద్దేశమని ప్రతినిధులు తెలిపారు. తద్వారా స్థానిక రైతుల పంటకు మార్కెట్‌లో మంచి మద్దతు ధర లభించడమే కాకుండా, విదేశీ మార్కెట్లలోనూ ఏపీ ఉత్పత్తులు పోటీపడే సామర్థ్యాన్ని పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముసునూరు వేదికగా ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు బాటలు వేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, లోతైన పరిశోధనలు మరియు ఆహార శుద్ధి రంగాలు ఒకే వేదికపైకి వచ్చి సాధించిన ఈ పురోగతి ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవనుంది. స్థానిక రైతులకు స్థిరమైన రాబడిని అందించడంతో పాటు, నవ్యాంధ్రను ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా తీర్చిదిద్దడంలో 'ముసునూరు పాప్‌కార్న్' కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు మరియు ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Musunuru Popcorn After Araku Coffee,  Andhra Pradesh Agriculture, Chandrababu Naidu, Gourmet Popcornica India, Non GMO Popcorn Hybrid Seed