TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మహ్మద్ యూనస్ ఉగ్రవాది: న్యూయార్క్ విమానాశ్రయంలో నిరసన సెగ.!

Published on: Tue Oct 13, 2026 6:44PM

బంగ్లాదేశ్‌ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్‌ యూనస్‌కు అమెరికాలో నిరసన సెగ తగిలింది. న్యూయార్క్‌లోని జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొందరు బంగ్లాదేశ్‌ ప్రవాసులు ఆయనను ఉగ్రవాది అంటూ అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి ఇక్కడికి వచ్చారంటూ నిందించారు.   ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.
వీల్‌చైర్‌లో వెళ్తుండగా నిరసన

మంగళవారం (అక్టోబర్‌ 12)  దోహా నుంచి ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో న్యూయార్క్‌ చేరుకున్న యూనస్‌.. జేఎఫ్‌కే విమానాశ్రయంలోని టెర్మినల్‌-8 నుంచి బయటకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీల్‌చైర్‌లో ఉన్న ఆయనను కొందరు నిరసనకారులు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు.  బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వహణ, హింసాత్మక ఘటనలు, అరెస్టులపై వారు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. యూనస్‌ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. 

బంగ్లాదేశ్‌లో 2024లో విద్యార్థుల ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో అప్పటి ప్రధానమంత్రి షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆగస్టు 2024లో మహమ్మద్‌ యూనస్‌ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. దేశంలో రాజకీయ స్థిరత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించడం, శాంతిభద్రతలను మెరుగుపరచడం వంటి అంశాలు ఆయన ప్రభుత్వ ముందున్న ప్రధాన సవాళ్లుగా నిలిచాయి.

అయితే ఆయన పాలనా కాలంలో రాజకీయ హింస, అరెస్టులు, మైనారిటీల భద్రత, శాంతిభద్రతల నిర్వహణ వంటి అంశాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా అమెరికాలో నిరసన తెలిపిన వారు కూడా ఇదే తరహా ఆరోపణలను ప్రస్తావించారు.  

న్యూయార్క్‌ విమానాశ్రయంలో యూనస్‌ను నిలదీసిన ఘటనపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం స్పందించింది. మాజీ ప్రధాన సలహాదారును అడ్డుకున్న ఘటనపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ సలహాదారు జాహెద్‌ ఉర్‌ రెహమాన్‌ ప్రకటించారు. విదేశాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామని, యూనస్‌కు కల్పించిన భద్రతా ప్రోటోకాల్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నదానిపైనా సమీక్షిస్తామని ప్రభుత్వం పేర్కొంది.    

[Muhammad Yunus Face Protest Newyork, Muhammad Yunus JFK Airport, Bangladesh Politics, Bangladeshi Expats Protest, Bangladesh Interim Government, Telugu One]