TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లవర్ హ్యాండ్ ఇచ్చిందని పేపర్ లీక్ గుట్టు విప్పాడు..!

Published on: Thu Aug 27, 2026 3:52PM

 

మహారాష్ట్ర MPSC స్కామ్‌లో సంచలన ట్విస్ట్..!

ఒక లవ్ స్టోరీ చివరకు దేశంలోనే అతిపెద్ద పోటీ పరీక్షల కుంభకోణాల్లో ఒకటైన మహారాష్ట్ర పేపర్ లీక్ ముఠా రట్టు కావడానికి దారితీస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ప్రేమ, ద్రోహం, కసి, పగ కలగలిసిన ఈ నిజ జీవిత నేర కథనం మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక ప్రేమికుడు తన ప్రియురాలికి సర్కారీ ఉద్యోగం ఇప్పించాలనే ఉద్దేశంతో దొంగదారిలో పరీక్ష ప్రశ్నపత్రాన్ని సంపాదించి ఇచ్చాడు. అయితే ఆ తర్వాత జరిగిన ఊహించని పరిణామాలు, ప్రేమికుల మధ్య వచ్చిన విభేదాలు వ్యవస్థలో వేళ్లూనుకున్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ ముందు ప్రత్యక్షంగా నిలబెట్టాయి. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) పరిధిలోని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి 2026 మార్చి 22న 6 విభాగ కేంద్రాలలో ఆఫ్ లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. 

ఈ పరీక్ష రాసేందుకు వేలాది మంది అభ్యర్థులు శ్రమించగా, మాలెగావ్‌కు చెందిన 24 ఏళ్ల గౌరవ్ పాటిల్ అనే యువకుడు తన ప్రియురాలు రుతుజా పాటిల్ ఉద్యోగం సాధించాలని ఆరాటపడ్డాడు. ఆమె తండ్రి, రాష్ట్రస్థాయి 'ఆదర్శ ఉపాధ్యాయుడు' అవార్డు గ్రహీత అమృత్ నామ్‌దేవ్ పాటిల్ (55) సహాయంతో నందోర్బార్‌లోని కౌటిల్య కోచింగ్ అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్ దిలీప్ పాటిల్ (40)తో రూ. 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో రూ. 5 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించగా, మార్చి 20న అంటే పరీక్షకు సరిగ్గా 2 రోజుల ముందే లీకైన పేపర్ ఫొటోకాపీ చేతులు మారింది. ఈ కుంభకోణం వెనుక పక్కా ప్లాన్ ప్రకారం ఉన్నతాధికారుల నెట్‌వర్క్ పనిచేసింది. MPSC అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విశ్వేశ్వర్ దత్తాత్రేయ నకాతే (35) కార్యాలయ పార్కింగ్ ఏరియాలో అండర్ సెక్రటరీ అభిజిత్ గణపత్‌రావు లెండ్వే (38)కి ప్రశ్నపత్రాన్ని అందించాడు. 

అతడి నుంచి మరో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గోపాల్ భట్టు మరాఠే (37) ద్వారా కౌటిల్య అకాడమీ డైరెక్టర్ ప్రవీణ్‌కు, ఆపై అమృత్ పాటిల్ ద్వారా గౌరవ్‌కు చేరింది. అసలు పరీక్షలో ఉన్న 294 ప్రశ్నలలో ఏకంగా 77 ప్రశ్నలు లీకైన సెట్ నుండి నేరుగా కలవడం గమనార్హం. గౌరవ్ తన సొంత సోదరుడు కూడా ఇదే పరీక్ష రాస్తున్నప్పటికీ అతడికి ఇవ్వకుండా, కేవలం తన ప్రియురాలికి మాత్రమే ఆ లీక్ ప్రశ్నలను అందించి ఆమెను విజేతగా నిలిపాడు. జూన్ 12న ఫలితాలు వెలువడగా మొత్తం 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. జూలై 1 నుండి జూలై 22 వరకు జరిగిన ఇంటర్వ్యూల అనంతరం జూలై 22న ప్రకటించిన మెరిట్ జాబితాలో రుతుజా పాటిల్ ఏకంగా 7వ ర్యాంక్ సాధించి 485 మంది అర్హుల జాబితాలో నిలిచింది. 

కానీ ఇక్కడే కథ ఊహించని మలుపు తిరిగింది. ఉద్యోగం సాధించిన వెంటనే రుతుజా గౌరవ్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. వారి వివాహానికి ఆమె కుటుంబం నిరాకరించడంతో ఆమె బంధాన్ని తెంచుకుంది. తాను ప్రాణంగా ప్రేమించి, చట్ట విరుద్ధంగా పేపర్ తెచ్చి ఇస్తే, ఉద్యోగం రాగానే తన్ను ఒంటరిని చేసి వెళ్లిపోవడాన్ని గౌరవ్ తట్టుకోలేకపోయాడు. కసితో రగిలిపోయిన గౌరవ్, జూలై 21 అర్ధరాత్రి MPSC కమిషన్‌కు అధికారిక ఈ-మెయిల్ పంపి మార్చి 22 పరీక్ష పేపర్ లీక్ అయిందని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. ఈ మెయిల్ అందడంతో కమిషన్ అంతర్గత విచారణకు ఆదేశించింది. పోలీసులు రంగంలోకి దిగుతున్నారని తెలిసి భయపడిన గౌరవ్, జూలై 26న "నా స్నేహితుడు ఫెయిల్ అయ్యాడని సరదాగా మస్కరీ చేస్తూ ఆ మెయిల్ పెట్టాను" అని చెబుతూ ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించాడు.

 అయితే అప్పటికే రంగంలోకి దిగిన ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లోతుగా విచారించి అసలు గుట్టు రట్టు చేసింది. పోలీసు విచారణలో మొత్తం దందాతో పాటు ముగ్గురు MPSC ఉన్నతాధికారులు, కోచింగ్ సెంటర్ డైరెక్టర్, ఉపాధ్యాయుడు  ప్రేమికుడు గౌరవ్ సహా 6 మంది పాత్ర బయటపడటంతో వారిని అరెస్ట్ చేసి సెప్టెంబర్ 2 వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ అక్రమాల నేపథ్యంలో MPSC యావత్ పరీక్ష ప్రక్రియను రద్దు చేసి, 485 మంది అభ్యర్థులకు మళ్లీ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఒక ప్రేమికుడి పగ వల్ల వెలుగులోకి వచ్చిన ఈ డ్రామా మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది

 

MPSC paper leak scandal, Maharashtra drug inspector exam, jilted lover paper leak tip off, MPSC recruitment scam 2026, Mumbai crime branch arrests, Maharashtra FDA exam leak, Telugu News, Telugug One