కమీషన్లు రావనే ఐటీఐఆర్ పై నిర్లక్ష్యం! 

తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల హీట్ పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య లేఖలు, సవాళ్ల యుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ కేంద్రంగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంలోకి ఎంటరై.. రెండు  పార్టీలను కడిగి పారేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.  ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని ఎద్దేవా చేశారు.  

ఐటీఐఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అన్నారు రేవంత్ రెడ్డి. ఐటీఐఆర్‌కు సమానమైన ప్యాకేజీ .. మంత్రి కేటీఆర్ ఇవ్వాలనడం దారుణమన్నారు. 

కేటీఆర్ .. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదు .. లెటర్ రాయడం ఏంటి .? అని ప్రశ్నించారు.  కమిషన్లు వచ్చేదుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని తెలిపారు. కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టభద్రులంతా బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.