Latest News
డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురిపై పోలీస్ కస్టడీ పిటిషన్
posted on: Mar 17, 2026 5:07PM

హైదరాబాద్ పరిసరాల్లో వెలుగుచూసిన ఫామ్‌హౌస్ డ్రగ్ పార్టీ కేసు రోజురోజుకు సంచలనంగా మారుతోంది. ఈ కేసులో కీలక నిందితులైన పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో మరిన్ని కీలక విషయాలు వెలికితీయాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాల ప్రకారం, ఈ పార్టీ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి, ఎందుకు నిర్వహించారన్న దానిపై విచారణ జరపాల్సి ఉంది. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారవేత్తలు, అడ్వకేట్లు ఈ పార్టీలో పాల్గొనడం అనుమానాలకు తావిస్తోంది. ఈ డ్రగ్ పార్టీల వ్యవహారం ఎప్పటి నుంచి కొనసాగుతోందన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది.
పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఫామ్‌హౌస్ వద్దకు చేరుకున్న సమయంలో, వారిపై కాల్పులు జరపమని రితేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి నమిత్ శర్మకు ఆదేశించినట్లు సమాచారం. అనంతరం నవీన్ శర్మ గాలిలోకి మూడు సార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులను గాయపరచాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారని అనుమానం వ్యక్తమవుతోంది. ఇంకా, పోలీసులను ఎదుర్కొనే బాధ్యత తమదేనని పైలట్, రితేష్ ఇద్దరూ నమిత్ శర్మకు చెప్పినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న నమిత శర్మ స్పృహ లేకుండా కాల్పులకు పాల్పడి నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలో విస్తృత పరిచయాలు ఉన్న నమిత్ శర్మ పాత్రపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, సిమ్లా నుంచి కౌశిక్ శర్మ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు విచారణలో తేలింది. సిమ్లాలో ఒక ప్రాజెక్ట్ పనుల నిమిత్తం వెళ్లిన కౌశిక్ శర్మ, అక్కడ కొంతమంది వ్యక్తుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాదు నగరానికి తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, పైలట్ రోహిత్ రెడ్డి తన వ్యాపార సంబంధాలను విస్తరించేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. నిందితులు గతంలో కూడా ఇలాంటి డ్రగ్ పార్టీలను నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే, పైలట్, నమిత్, రితేష్ రెగ్యులర్‌గా డ్రగ్స్ వినియోగి స్తున్నట్లు విచారణలో బయట పడింది. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ కస్టడీపై కోర్టు నిర్ణయం అనంతరం విచారణ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.



.webp)


