TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి: పుష్కరకాలంలో ఎన్నడూ లేనంతా ఎదురుగాలి.!

Published on: Sat Sep 26, 2026 4:47PM

దేశ రాజకీయాకాశంలో గత కొంతకాలంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకదాని వెనుక ఒకటి అన్నట్లుగా సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థల నిర్ణయాలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న   విమర్శలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి.

పుష్కరకాలంగా ఎన్నడూ లేని విధంగా మోడీ సర్కార్ డిఫెన్స్ లో పడుతోంది.    రాజకీయంగానే కాకుండా, వ్యవస్థాగత అంశాలలోనూ మోడీ సర్కార్  సమస్యల సంక్షోభంలో కూరుకుపోతున్నది.   నీట్ పరీక్ష పత్రం లీక్ కావడం నుంచి మొదలై.. తాజాగా ఎన్నికల సంఘంలో తలెత్తిన సంక్షోభం వరకూ వరుసగా జరుగుతున్న పరిణామాలు నైతికంగా మోడీ సర్కార్ ను బలహీనం చేశాయనడంలో సందేహం లేదు. నీట్ వ్యవహారాన్ని తీసుకుంటే.. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

అప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 

ఇక తాజాగా   ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై వస్తున్న విమర్శలు, ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విభేదాలు.. మోడీ సర్కార్ ను మరింత డిఫెన్స్ లో పడేశాయి.  ఎన్నికల సంఘం పనితీరుపై  వెల్లువెత్తుతున్న విమర్శలు మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలలోని డొల్లతనాన్నీ, ఆధిపత్య ధోరణినీ ప్రస్ఫుటం చేశాయి.  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్   రాజీనామా డిమాండ్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓటర్ల జాబితాల సవరణ, ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటం మోడీ సర్కార్ పునాదులను కదిలిస్తున్న పరిస్థితి గోచరిస్తోంది. నీట్, ఎన్నికల సంఘం వివాదాలు కేంద్ర ప్రభుత్వ పతిష్టను మసకబార్చాయి. 

మరోవైపు  వందేమాతరం వివాదం కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే మారింది.  పార్లమెంట్‌లో ఈ గీతాలాపనపై జరిగిన చర్చలు  దుమారాన్ని రేపాయి. ఈ గీతాన్ని పూర్తిగా పాడాలనే నిబంధనలు తేవడం, చివరి చరణాలలోని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం కావడం దీనికి సంబంధించి కోర్టుల నుంచి వచ్చిన తీర్పులు, ప్రతికూల వ్యాఖ్యలు మోడీ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి.  న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు పాలకుల చర్యలకు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో..  ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే తీరు కూడా వివాదాస్పదంగా మారి కొత్త చర్చకు తెరలేపింది.  

 ఒకవైపు దేశాభివృద్ధి, మరోవైపు సాంస్కృతిక జాతీయవాదం అనే అజెండాతో  సాగుతున్న  మోడీ సర్కార్‌కు ఈ పరిణామాలు స్పీడ్ బ్రేకర్లుగా మారాయి.   ఈ వరుస పరిణామాలు ముందుముందు మారనున్న రాజకీయ సమీకరణాలకు సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేవలం సంఖ్యాబలం ఉందన్న ధీమాతో ఇష్ఠారీతిగా నిర్ణయాలు తీసుకోవడం, విధానాలు రూపొందించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏ ప్రజలైతే చట్ట సభల్లో మోడీ సర్కార్ కు సంఖ్యాబలం ఇచ్చారో.. ఆ ప్రజలే ఇప్పుడు కేంద్ర విధానాలు, నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.  ముందు ముందు ఈ వివాదాలు ఏ రూపందాలుస్తాయన్నది చూడాలి. మొత్తం మీద వరుసగా మూడు ఎన్నికలలో మోడీ సర్కార్ పై విశ్వాసం ఉంచి అధికారం కట్టబెట్టిన ప్రజ ఇప్పుడు.. అదే మోడీ సర్కార్ పై ఆగ్రహంతో రగిలిపోతోంది. ప్రజాభీష్ఠానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని కుండబద్దలు కొడుతోంది.  ఇప్పుడీ సవాళ్లను మోడీ ఎలా ఎదుర్కొని అధిగమిస్తారన్నది ఆసక్తిగా మారింది.  


[Modi Government, Cisises, NEET Leak Controversy, Election Commission, Vandemataram Song, Opposition, Criticism, People Anger]