ప్రధానిగా మోడీ పుష్కర కాలం పాలన.. ప్లస్ మైనస్ లు ఏంటంటే?
Published on: Tue Aug 25, 2026 3:05PM

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ మైలురాయిని చేరుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, సుదీర్ఘ కాలం పాటు (డెమెక్రటికల్లీ ఎలెక్టెడ్, లాంగెస్ట్ కంటిన్యూస్లీ సర్వింగ్) ప్రధానిగా కొనసాగుతున్న నేతగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, ఒకవైపు ఆర్థిక ప్రగతి మరియు నిర్ణయాత్మక నిర్ణయాలు కనిపిస్తుండగా, మరోవైపు పలు అంశాలపై తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ పన్నెండేళ్లూ.. సుస్థిరమైన పాలన అందించడానికి సహకరించిన అంశాలు అలాగే ఈ పన్నెండేళ్లలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశంలో సాధించిన విజయాలు, వైఫల్యాలతో పాటు అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ అరుదైన ఈ ఫీట్ సాధించడం ఎలా సాధ్యమైంది? అసలు ఏంటి ఆయన రికార్డు? 4399 రోజులు అనేది ఇది మాత్రమేనా ఇంకా ఏమనా ఆయన సాధించిన రికార్డు ఉందా? అన్న అంశంపై సీనియర్ జర్నలిస్టు కందుల రమేష్ తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
కందుల రేమేష్ విశ్లేషణ మేరకు.. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దాదాపు 17 ఏళ్లు, ఇందిరా గాంధీ 16 ఏళ్ల పాటు ప్రధానులుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, సాంకేతికంగా మోదీ రికార్డును ప్రత్యేకంగా పేర్కొనడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అధికార మార్పిడిలో భాగంగా నెహ్రూ ప్రధాని అయ్యారు. అంటే అప్పుడు ఆయన ఎలెక్టెడ్ పీఎం కాదు, సెలెక్టెడ్ పీఎం. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు 1952లోనే జరిగాయి. అలాగే ఇందిరా గాంధీ 16 ఏళ్లు ప్రధానిగా ఉన్నప్పటికీ, 1977లో ఆమె పరాజయం పాలై పదవికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో, వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో నెగ్గి, ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం పరిపాలించిన ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీది రికార్డే.
ఇక పుష్కర కాలంగా సుస్థిర పాలన అన్న దానిపై మాట్లాడుతూ కందుల రమేష్.. నరేంద్ర మోడీ నాయకత్వం వల్ల బీజేపీ బలపడిందని ఆ పార్టీ వారే కాదు.. జనం కూడా భావిస్తున్నారన్నారు. ఇందుకు మోడీ కర్మిష్మా, ఫాలోయింగ్ కారణమన్నారు. అయితే దీనివల్ల జరిగింది మంచా, చెడా అన్నది పక్కన పెడితే.. మోడీ కారణంగానే బీజేపీ వరుసగా మూడు సార్లు ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాగలిగిందనడంలో సందేహం లేదని అన్నారు. ఇక్కడ చర్చనీయాంశమన్నారాయన.
అలాగే.. 2013-14లో అంటే మోడీ ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తతం 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.
ఇక మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే బడ్జెట్ గణనీయంగా పెరిగింది. జీడీపీలో ఒకప్పుడు 1.7 శాతంగా ఉన్న మూలధన వ్యయం ప్రస్తుతం 3.3 శాతానికి చేరింది. 2 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ. 11 లక్షల కోట్లకు పైగా నిధులు రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, వందే భారత్ రైళ్లు, నూతన విమానాశ్రయాల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు.
యూపీఐ ద్వారా రోజువారీ డిజిటల్ లావాదేవీల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జనధన్ యోజన ద్వారా కోట్లాది మంది సామాన్యులకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
రక్షణ, స్పేస్ రంగాలను ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచారు. దీనివల్ల దేశీయంగా అనేక హైటెక్ స్టార్టప్‌లు, డ్రోన్ మరియు శాటిలైట్ తయారీ సంస్థలు రూపుదిద్దుకున్నాయి. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణ, ట్రిపుల్ తలాక్ రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం మరియు అయోధ్య రామమందిర వివాదానికి సజావుగా ముగింపు పలకడం మోదీ ప్రభుత్వ రాజకీయ సంకల్పానికి నిదర్శనంగా చెప్తుంటారు.
ఇవన్నీ మోడీ సర్కార్ విజయాలు అయితే.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మోడీ అధికారంలోకి రాకముందు రూపాయి విలువను పెంచుతామని చెప్పినప్పటికీ, ఈ పుష్కర కాలంలో అది జరగలేదు సరికదా.. రూపాయి విలువ క్షీణిస్తూ వచ్చింది. వస్తోంది. బలాధిక్యత కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ నిరంతరం తగ్గుతూనే వస్తోంది.
అదే విధంగా పాలనాపరమైన నిర్ణయాలు, ఎజెండా అమలు కారణంగా దేశంలో మత, సామాజిక పోలరైజేషన్ పెరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద వరుసగా మూడు సార్లు ఎన్డీయే కూటమిని విజయపథంలో నడిపించి, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో ముద్రవేశారనడంలో సందేహం లేదన్నారు ప్రధాని కందుల రమేష్.
Modi 12years rule as PM, Record, Achievements, Failures, Democratically, Elected, Continuously


