భూమి లేదు.. పత్రాలు లేవు.. ఏపీ ఎమ్మెల్సీకి రూ.25 లక్షల టోకరా.!
Published on: Sat Oct 10, 2026 12:49PM

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో విలువైన స్థలాన్ని విక్రయిస్తామంటూ నమ్మించిన ఇద్దరు వ్యక్తులు.. టోకెన్ అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్డు పక్కన సుమారు ఐదెకరాల స్థలం తమదేనంటూ పేరూరు తులసీగోపాల్, అతడి కుమారుడు గిరిధర్ ఎమ్మెల్సీ రామచంద్రయ్యను నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సదరు స్థలం న్యాయ వివాదంలో ఉందని, అందుకే తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పి ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో టోకెన్ అడ్వాన్స్‌గా రూ.25 లక్షలు చెల్లించాలని కోరడంతో.. ఎమ్మెల్సీ ఆ మొత్తాన్ని ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశారు.డబ్బులు తీసుకున్న తర్వాత స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని రామచంద్రయ్య కోరినట్లు తెలిసింది. అయితే, నిందితులు పత్రాలు అందించకుండా కాలయాపన చేస్తూ తప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ.. స్థలం యాజమాన్య వివరాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో సదరు స్థలంతో నిందితులకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను మోసపోయానని గుర్తించిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.
ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్ఎస్ 316(2), 318(4) సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థలం అసలు యజమానులు ఎవరు? నిందితులు ఈ వ్యవహారంలో ఎలా వ్యవహరించారు? రూ.25 లక్షల నగదు ఎక్కడికి బదిలీ అయింది? అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్‌లో విలువైన భూముల కొనుగోలు వ్యవహారాల్లో అప్రమత్తత ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. భూమి యాజమాన్య హక్కులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పెండింగ్‌లో ఉన్న న్యాయ వివాదాలను ముందుగానే పరిశీలించిన తర్వాతే కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం మంచిదని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
[ MLC C Ramachandraiah, Andhra Pradesh MLC, Hyderabad Land Fraud, Madhapur Land Scam, Rs 25 Lakh Cheating Case, Jubilee Hills Police, Real Estate Fraud, Telangana Crime News ]


