తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్టిమేటమ్.. నిధుల కోసం నిరవధిక దీక్ష హెచ్చరిక.!
Published on: Mon Oct 26, 2026 4:53PM
.webp)
తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. సొంత పార్టీ ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా విమర్శలు గుప్పిస్తూ ఓ వైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోతుంటే.. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విధానాలపై తిరుగుబావుటా ఎగురవేశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు. నిధుల కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై విమర్శలు గుప్పించిన ఆయన రోడ్ల అభివృద్ధి పనుల నిధుల కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.
రాజాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించిన ఆయన స్థానికులను మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేవలం కొద్దిమంది మంత్రుల నియోజకవర్గాలకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు అవుతున్నాయనీ, ఎమ్మెల్యేల నియోజకవర్గాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ఒక కాంట్రాక్టర్ మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.5 కోట్ల బిల్లు తక్షణమే చెల్లించారని, అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కూడా ప్రాణాలు కోల్పోవాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రాణమా, అభివృద్ధి నిధులా అనేది ప్రభుత్వమే తేల్చాలన్నారు.

క్షేత్రస్థాయిలో పనులు జరగకపోవడంతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నామన్న ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను పలుమార్లు నేరుగా కలిసి వినతి పత్రాలు సమర్పించినా మాటల హామీలే తప్ప నిధుల విడుదల జరగలేదని జనంపల్లి అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం స్పష్టమైన సానుకూల నిర్ణయం రాకపోతే గాంధీభవన్ వేదికగా నిరవధిక దీక్ష కు దిగుతానని హెచ్చరించారు.
[MLA Anirudh Reddy Hunger Strike Warning, Jadcherla MLA Congress, Pending Bills,Ultimatum, Revanth, Sarkar, Teluhu One]


