TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హఫీజ్‌పేట్ లాడ్జిలో 27 ఏళ్ల డాక్టర్ సృజన హత్య: రంగంలోకి మియాపూర్ పోలీసులు!

Published on: Sat Oct 3, 2026 11:01AM

హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌‌పేట్ పరిధిలో వెలుగుచూసిన ఒక దారుణ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఉన్నత చదువులు చదివి, డాక్టర్‌గా సమాజానికి సేవ చేయాల్సిన ఒక 27 ఏళ్ల యువతి.. సోషల్ మీడియా పరిచయం వల్ల ప్రాణాలు కోల్పోయిన తీరు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన భూమయ్య రెండో కుమార్తె కె. సృజన (27) చిన్నతనం నుంచే చదువుల్లో ఎంతో ప్రతిభ కనబరిచింది. మహబూబ్‌నగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సృజన, ప్రస్తుతం హనుమకొండలోని ఒక వైద్య కళాశాలలో పీడియాట్రిషన్ (పిల్లల వైద్య విభాగం) పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు హనుమకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పీడియాట్రిషియన్‌గా వైద్య సేవలు కూడా అందిస్తోంది.

అయితే సుమారు 7 ఏళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ (Instagram) ద్వారా సృజనకు రవికుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కాలక్రమేణా ఆ పరిచయం కాస్తా నమ్మకమైన స్నేహంగా మారింది. ఇటీవల రవికుమార్ సృజన వద్ద నుండి ఒక బంగారు గొలుసు తీసుకున్నాడని, ఆ గొలుసును తిరిగి ఇచ్చేస్తానని నమ్మబలికి ఆమెను హైదరాబాద్‌కు రావాలని కోరినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. రవికుమార్ మాటలను నమ్మిన సృజన గత నెల సెప్టెంబర్ 30వ తేదీన హనుమకొండ నుండి హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చింది. కానీ, ఆ తర్వాత ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడమే కాకుండా, సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో అనుమానం వచ్చిన స్నేహితులు తక్షణమే సృజన తండ్రి భూమయ్యకు సమాచారం అందించారు.

ఆందోళన చెందిన తండ్రి భూమయ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. సృజన సెల్‌ఫోన్ సిగ్నల్ మరియు కాల్ డేటా ఆధారంగా ఆమె మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఈ దర్యాప్తు క్రమంలో రవికుమార్ సెప్టెంబర్ 29నే హఫీజ్‌పేట్‌లోని ఒక సర్వీస్ అపార్ట్‌మెంట్ లేదా లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నట్లు పోలీసులకు సాంకేతిక ఆధారాలు లభించాయి. వెంటనే ఆ లాడ్జి గది వద్దకు చేరుకుని తలుపులు తెరిచి చూడగా, సృజన మంచంపై మృతదేహమై కనిపిచడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతదేహం అప్పటికే కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో, ఆమెను 2 నుండి 3 రోజుల క్రితమే అత్యంత కిరాతకంగా హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

లాడ్జి గదిలో సృజనను దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే బంగారు గొలుసు ఇస్తానని నమ్మించి ఆమెను హైదరాబాద్ రప్పించి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హత్య జరిగిన అనంతరం నిందితుడు రవికుమార్ పరారవ్వడమే కాకుండా తన ఫోన్‌‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లాడ్జిలోని సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుడు రవికుమార్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏడేళ్ల సోషల్ మీడియా పరిచయం చివరకు ఒక దివ్యమైన భవిష్యత్తు ఉన్న యువ డాక్టర్ ప్రాణాలను బలితీసుకోవడం సమాజంలో ఆన్‌లైన్ పరిచయాల పట్ల ఉన్న ప్రమాదాలను మరొకసారి హెచ్చరిస్తోంది.

 

 

Doctor Srijana murder, Hafeezpet lodge murder case, Miyapur police murder investigation, Hyderabad crime news, Doctor Srijana news, Hafeezpet crime update, Miyapur police doctor case.