TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మిస్సింగ్ 54.. చరిత్ర చెప్పని నిజాలు.. సమాధానాలు దొరకని ప్రశ్నలు.!

Published on: Sun Sep 6, 2026 5:41PM

 1971 నాటి ఇండో, పాక్ యుద్ధం ముగిసి అర్ధ శతాబ్దం దాటినప్పటికీ, ఆ రణరంగంలో అదృశ్యమైన భారత రక్షణ సిబ్బంది ఆచూకీ మాత్రం నేటికీ అంతుచిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఒక వైపు శత్రు దేశపు చెరలో వారు బందీలుగా మగ్గుతున్నారనే భారత ప్రభుత్వ   అధికారిక వాదన..  కుటుంబ సభ్యుల అంతులేని ఆవేదన..  మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి వస్తున్న నిరంతర ఖండనల నడుమ ఈ విషాదగాథ నలుగుతోంది. ఇది కేవలం గత యుద్ధానికి సంబంధించిన ఒక భావోద్వేగ అంశం మాత్రమే కాకుండా..  ఒక సార్వభౌమ ప్రజాస్వామ్య దేశం తన సైనికుల అంతిమ గతి గురించి సమాధానం చెప్పాల్సిన నైతిక, న్యాయపరమైన బాధ్యతను కూడా  గుర్తు చేస్తోంది. ఐదు దశాబ్దాలు  గడిచిపోయినా ఆ సైనికుల సంఖ్యాపరమైన స్పష్టత, వారి జీవితాల వాస్తవ పరిస్థితి ఏమిటనే దానిపై ముగింపు పలకని అధ్యాయంగానే సాగుతోంది. యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోయిన లేదా అదృశ్యమైన సైనికుల విషయంలో  సమాచారం లేదు అనే  పాలనాపరమైన బదులును పదే పదే ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా  నిపుణులు అభివర్ణిస్తున్నారు.  

ఈ చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, 1971 డిసెంబర్ 3న ప్రారంభమైన   ఇండియా, పాకిస్థాన్  యుద్ధం  13 రోజులపాటు  సాగింది. డిసెంబర్ 16న పాకిస్థాన్ తూర్పు కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎ.ఎ.కె. నియాజీ ఢాకాలో భారత సైన్యం ఎదుట బేషరతుగా లొంగిపోయారు. ఈ చారిత్రక పరిణామంతో సుమారు 93 వేల మంది పాకిస్థానీ సైనికులు యుద్ధ ఖైదీలుగా భారత్ అధీనంలోకి వచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ చరిత్రలోనే ఇది అతిపెద్ద సైనిక లొంగుబాటుగా నిలిచింది. తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర సార్వభౌమ దేశంగా బంగ్లాదేశ్ రూపంలో ఆవిర్భవించింది. అయితే, అదే సమయంలో పశ్చిమ రంగంలో భారత సైన్యం శత్రువులతో పోరాడుతున్న తరుణంలో కొందరు ఇండియా సైనికులు   అనుమానాస్పద రీతిలో కనిపించకుండా పోయారు. వీరిలో 51 మంది 1971 యుద్ధానికి చెందినవారు కాగా..  మరో ముగ్గురు అంతకుముందు జరిగిన 1965 యుద్ధానికి సంబంధించినవారు. మొత్తం 54 మంది రక్షణ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు చేరలేదు.  ఈ మొత్తం 54 మందిలో 27 మంది ఆర్మీకి, 24 మంది ఎయిర్ ఫోర్స్‌కు, ఇద్దరు నేవీకి, ఒకరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ విభాగానికి చెందినవారని రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. 

అయితే మళ్లీ అదే సమయంలో..  ఆ జాబితాలోని ముగ్గురు సైనికుల సర్వీస్ రికార్డులు, వారి యూనిట్ వివరాలు లేదా కనీసం కుటుంబ నేపథ్యానికి సంబంధించిన సమాచారం కూడా తమ వద్ద లేదని ప్రభుత్వం ఆ అఫిడవిట్‌లో అంగీకరించడం   అనుమానాలకు తావిచ్చింది. సొంత సైనికుల ప్రాథమిక వివరాలు కూడా సక్రమంగా లేని యంత్రాంగం వారి అంతిమ గతిని ఏ విధంగా నిర్ధారించగలదనే ప్రశ్న తలెత్తింది  కాలక్రమేణా ఈ ఉదంతానికి సంబంధించి అనేక కీలక సంఘటనలు నమోదయ్యాయి. 1971 డిసెంబర్ 5న పాకిస్థాన్ ప్రముఖ పత్రిక  పాకిస్థాన్ అబ్జర్వర్ తన సంచికలో ఐదుగురు ఇండియన్  పైలట్లను   బంధించినట్లు స్పష్టంగా ప్రకటించింది. వారిలో ఒకరిని  టాంబే అని పేర్కొన్నారు. ఇది మన దేశానికి చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ విజయ్ వసంత్ తాంబే పేరుతో   సరిపోలింది. కానీ ఆ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా తాంబే తమ చెరలో ఉన్నాడని ఒప్పుకోలేదు. 

ఆ తర్వాత 1972 జూలై 2న అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్థాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో చారిత్రక సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యుద్ధ ఖైదీల మార్పిడి అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. అయితే ఈ ఒప్పందంలో 93 వేల  మంది పాకిస్థానీ ఖైదీల విడుదల లేదా కాశ్మీర్ అంశంపై స్పష్టమైన ప్రస్తావన రాలేదు. బంగ్లాదేశ్ నేత ముజిబుర్ రెహమాన్ భాగస్వామ్యం లేకుండా ఈ అంశాలపై ఒంటరిగా చర్చించడానికి ఇందిరా గాంధీ నిరాకరించడంతో ఈ ఒప్పందం ఒక పరిధికే  పరిమితమైంది.  

తదుపరి కాలంలో 1973 ఆగస్టు 28న కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం, తూర్పు రంగంలో పట్టుబడిన పాకిస్థానీ ఖైదీలను భారత్ విడుదల చేసింది. ప్రతిగా పాకిస్థాన్ 617 మంది భారతీయ సైనికులను స్వదేశానికి పంపింది. కానీ ఆ అప్పగింత జాబితాలో అదృశ్యమైన 51 మంది పేర్లు లేవు. ఆ తర్వాత 1979లో లోక్‌సభలో మొదటిసారిగా 40 పేర్లతో కూడిన జాబితాను ప్రవేశపెట్టగా, అది క్రమంగా 1983 నాటికి 54 పేర్లకు చేరింది. కుటుంబ సభ్యులు స్వయంగా పాకిస్థాన్ జైళ్లను సందర్శించే ప్రయత్నాలు చేసినప్పటికీ, ముల్తాన్ వంటి కారాగారాల్లో పర్యటించినా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. 2007లో కొందరు బంధువులు పాకిస్థాన్‌లోని వివిధ జైళ్లలో పర్యటించి వారు జీవించే ఉన్నారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేసినా, పాకిస్థాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ దానిని పూర్తిగా ఖండించింది.  

న్యాయపరమైన కోణంలో చూస్తే..  జెనీవా కన్వెన్షన్ మూడవ ప్రోటోకాల్ ఆర్టికల్ 118 అత్యంత స్పష్టంగా ఒక నియమాన్ని నిర్దేశిస్తోంది. శత్రుత్వాలు ముగిసిన వెంటనే యుద్ధ ఖైదీలను ఎటువంటి ఆలస్యం చేయకుండా విడుదల చేసి స్వదేశానికి పంపాలని ఇది ఆదేశిస్తుంది. శత్రు దేశం నిర్బంధించిన సైనికులను విడుదల చేయడం కేవలం ద్వైపాక్షిక ఒప్పందాలపై ఆధారపడి ఉండదని, అది ఏకపక్ష బాధ్యత అని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ (ఐసీఆర్సీ) స్పష్టం చేసింది. ఒకవేళ పాకిస్థాన్ నిజంగానే భారత సైనికులను అణచిపెట్టి ఉంటే, అది జెనీవా కన్వెన్షన్ ఉల్లంఘన కింద అంతర్జాతీయ నేరమవుతుంది. అయితే సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు తమ సమస్యలను కేవలం ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అంగీకరించడం వల్ల..  మూడవ పక్షం లేదా అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. 

ఈ దౌత్యపరమైన పంజరం కారణంగా భారత్ తన సైనికుల గతిని అంతర్జాతీయ వేదికలపై ఇండియా గట్టిగా నిలదీయలేని పరిస్థితిని ఎదుర్కొంది.  ఈ సుదీర్ఘ కాలంలో ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ, సామాజిక దృక్పథంలో పెద్దగా మార్పు రాలేదు. పార్లమెంట్‌లో ప్రశ్నలు ఎదురైనప్పుడు కేవలం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే  సాంప్రదాయ సమాధానాలతో సరిపెట్టారే తప్ప.. క్షేత్రస్థాయిలో కఠినమైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు. సీనియర్ జర్నలిస్టులు తమ పరిశోధనల్లో వెల్లడించిన ప్రకారం..  ఒక దశలో కోర్టులో సమర్పించిన వివరాలలో కొందరు మరణించినట్లు ప్రభుత్వ పత్రాల్లో పేర్కొన్నప్పటికీ, బహిరంగంగా మాత్రం అందరూ ఇంకా అదృశ్యమయ్యారనే పాత వాదననే కొనసాగించడం పట్ల   విమర్శలు వ్యక్తమయ్యాయి. 

ప్రభుత్వ సంస్థల ఈ వైరుధ్య ధోరణి బాధిత కుటుంబాలను మరింత మానసిక క్షోభకు గురిచేసింది.  కుటుంబాల పరంగా చూస్తే ఈ విషాదం వారి జీవితాలను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. కొద్ది నెలల వైవాహిక జీవితం తర్వాత భర్తలను కోల్పోయిన భార్యలు, తండ్రి జాడ తెలియక మానసిక క్షోభతో కుంగిపోయిన పిల్లలు ఈ సుదీర్ఘ పోరాటంలో అలసిపోయారు. ప్రభుత్వ రికార్డుల్లో కేవలం కొన్ని ఫైల్ నంబర్లుగా మిగిలిపోయిన తమ ప్రియతములైన వారి గురించి నిజం నిగ్గుతేల్చాలని వారు దశాబ్దాలుగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తూనే ఉన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల విషయంలో ఇలాంటి నిశ్శబ్ద వైఖరి కొనసాగడం జాతీయ స్థాయిలో ఒక పెద్ద లోపంగా నిలిచింది.  భవిష్యత్తులో ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలంటే కేవలం రాజకీయం కాకుండా నిఖార్సైన దౌత్యపరమైన ఒత్తిడి అవసరం. ఈ 54 మంది సైనికులు ఒకవేళ ఇప్పటికీ జీవించి ఉంటే వారు  వృద్ధాప్య దశకు చేరుకుని ఉంటుంది. వారు బతికి ఉన్నా లేకపోయినా, వారి నిజమైన గతి ఏమిటో తెలుసుకునే హక్కు ఆ కుటుంబాలకు, ఈ దేశ ప్రజలకు ఉంది. అజ్ఞానాన్ని లేదా సమాచారం లేదనే సాకును దశాబ్దాల తరబడి కొనసాగించడం దేశ ప్రతిష్టకు ఏమాత్రం మంచిది కాదు. ఒక దేశం తన రక్షణ రంగానికి చెందిన సైనికుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించడమే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థకు అసలైన బలం. 

 -సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    


[Missing 54 Indian soldiers,  1971 Indo Pak war prisoners, Indian defence personnel missing in Pakistan, Simla Agreement, Telugu One]