రోజు 10 నిమిషాల ధ్యానం.. ఆలోచనా శక్తినే మార్చేసే అద్భుత మార్గం.. !
Published on: Tue Sep 15, 2026 7:41PM
రోజు 10 నిమిషాల ధ్యానం.. ఆలోచనా శక్తినే మార్చేసే అద్భుత మార్గం.. !

ఈనాటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. పరిగెత్తే కాలంతో పాటు ఆలోచనలు కూడా అంతే వేగంగా పరిగెడుతున్నాయి. ఇలాంటి సమయంలో మనస్సుకు కాస్త విశ్రాంతినిచ్చి, ఆలోచనా శక్తిని పునర్నిర్మించుకోవడానికి రోజుకు పది నిమిషాల ధ్యానం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ధ్యానం అనగానే గంటల తరబడి పద్మాసనంలో కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ కేవలం పది నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మెదడు పనితీరులో, ఆలోచనా సరళిలో ఊహించని మార్పులు వస్తాయని ఆధునిక సైన్స్ కూడా నిరూపించింది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
మెదడు మీద ప్రభావం..
మన మెదడులోని నాడుల నిర్మాణం నిరంతరం మారుతూ ఉంటుంది. దీనిని సైన్స్ భాషలో న్యూరోప్లాస్టిసిటీ అంటారు. రోజువారీ ధ్యానం ఈ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజూ పది నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మెదడులో శ్రద్ధ, ఏకాగ్రత, నిర్ణయాధికారాన్ని నియంత్రించే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం బలపడుతుంది. దీనివలన క్లిష్టమైన సమస్యలను సహజంగా, వేగంగా పరిష్కరించే ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఎటువంటి పరిస్థితిలోనైనా స్థిరంగా ఆలోచించే సామర్థ్యం అలవడుతుంది.
అలాగే, భయం, ఆందోళన, ఒత్తిడికి కారణమయ్యే మెదడులోని అమిగ్డాలా అనే భాగం యొక్క పరిమాణం ధ్యానం వల్ల తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందే అలవాటు పోయి, ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో చూడటం ప్రారంభమవుతుంది.
స్పష్టత..
ఆలోచనల్లో స్పష్టత వచ్చి, వ్యర్థమైన భావోద్వేగాలను తగ్గించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
పది నిమిషాల ధ్యానం మన దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. నేటి డిజిటల్ యుగంలో అనేక విషయాల వల్ల ఏకాగ్రత సులభంగా చెదిరిపోతుంది. రోజువారీ ధ్యాన సాధన వల్ల మైండ్ ఫుల్ నెస్ పెరుగుతుంది. అంటే చేసే ప్రతి పనిపై పూర్తి శ్రద్ధ పెట్టగలుగుతాం. ఇది పనిలో ఉత్పాదకతను, నాణ్యతను పెంచడమే కాకుండా, సృజనాత్మక ఆలోచనలు రావడానికి మార్గం సుగమం చేస్తుంది.
ఎమోషన్స్..
ధ్యానం వల్ల భావోద్వేగ స్థిరత్వం లభిస్తుంది. మన ఆలోచనలకు, శారీరక స్పందనలకు నడుమ ఉన్న సంబంధాన్ని ఇది బలోపేతం చేస్తుంది. కోపం, అసహనం, నిరాశ వంటి ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు వాటికి ప్రతిస్పందించే ముందు ఒక క్షణం ఆలోచించే విచక్షణ లభిస్తుంది. ఇది సంబంధ బాంధవ్యాలను మెరుగుపరచడమే కాకుండా, మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
ఈ అద్భుతమైన అలవాటును ప్రారంభించడం కూడా చాలా సులభం. ఉదయం నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఒక ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. వెన్నుముక నిటారుగా ఉంచి కూర్చుని, కళ్ళు మూసుకుని శ్వాసపై మాత్రమే దృష్టి పెట్టాలి. గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం గమనించాలి. మొదట్లో ఆలోచనలు చెల్లాచెదురుగా రావడం సహజం, కానీ వాటిని ఆపడానికి ప్రయత్నించకుండా కేవలం గమనిస్తూ మళ్లీ శ్వాసపై దృష్టి సారిస్తే సరిపోతుంది.
రోజుకు కేవలం పది నిమిషాల సమయం మన జీవితంలో చాలా చిన్నది. కానీ ఈ చిన్న సమయం మన మానసిక ఆరోగ్యంలో, ఆలోచనా విధానంలో, మొత్తం జీవన నాణ్యతలో తీసుకొచ్చే మార్పు మాత్రం వర్ణించలేనిది. ప్రశాంతమైన జీవితం, స్పష్టమైన ఆలోచనలు కావాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ పది నిమిషాల సాధనను తమ జీవితంలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.
*రూపశ్రీ.


