వెయ్యి పాఠశాలలకు 5-స్టార్ హోదా.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు.!
Published on: Mon Oct 5, 2026 7:17PM
.webp)
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు .ఉండవల్లిలోని తన నివాసంలో పాఠశాలల మౌలిక వసతులు, స్కిల్ డెవలప్‌మెంట్‌పై లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని జీరో-స్టార్ పాఠశాలలను వన్-స్టార్ స్థాయికి తీసుకురావాలని ఆదేశించారు. ఏడాదిలోగా వన్-స్టార్ పాఠశాలలను టూ-స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు.
2029 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను 4-స్టార్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అలాగే.. కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్ స్థాయికి అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని పాఠశాలలకు మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,685 వన్-స్టార్, 15,618 టూ-స్టార్, 19,099 త్రీ-స్టార్, 7,172 ఫోర్-స్టార్ పాఠశాలలు ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.రాష్ట్రంలోని సుమారు 7 వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయి కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ ఆదేశించారు. అకడమిక్ సంస్కరణలు పూర్తవుతున్న నేపథ్యంలో.. ఇకపై విద్యార్థుల అభ్యసన ఫలితాల మెరుగుదలపై అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్‌పైనా మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ఏడాది 5 లక్షల మంది విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్, నేషనల్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్ వంటి కేంద్ర పథకాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను నైపుణ్యం పోర్టల్‌లోకి తీసుకురావాలని.. ఏఐ ఆధారిత విధానాలతో ఇంటర్వ్యూలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేలా యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అన్నారు. సీడాప్, ఓంక్యాప్‌ల ద్వారా జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించాలని అధికారులను ఆదేశించారు.పాఠశాలల అభివృద్ధితో పాటు.. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ అందించడంపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.

[ Minister Nara Lokesh, Andhra Pradesh Schools, AP Government Schools, 5 Star Schools, School Infrastructure, Education Development, AP Education, Skill Development, PMKVY, Skill Training, Student Skill Development, Government Schools, Leap Schools, Atal Tinkering Labs, Computer Labs, PM Internship Scheme ]


