TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పల్నాడులో రోడ్డు ప్రమాదం: మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం.!

Published on: Tue Oct 6, 2026 12:02PM

పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత డ్రైవర్ తన్నీరు శ్రీహరి దుర్మరణం పాలయ్యారు. ఆయన వయస్సు 32 ఏళ్ళు.  చిలకలూరిపేట పరిధిలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ రోడ్డుపై సోమవారం (అక్టోబర్ 5) రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీహరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డ ఆయన చికిత్స కోసం తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల కథనం  ప్రకారం.. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన శ్రీహరి తన మోటార్‌సైకిల్‌పై పోలిరెడ్డిపాలెం బైపాస్‌ మీదుగా వెళ్తున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి శ్రీహరి బైక్‌పై నుంచి ఎగిరిపడి రోడ్డుపై పడటంతో తలకు, శరీరంలోని ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పాటు గాయపడిన శ్రీహరిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆయన మార్గమధ్యంలోనే మృతి చెందారు.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై శ్రీహరి తండ్రి అంకయ్య ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.శ్రీహరి చాలాకాలంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. తన వద్ద నమ్మకంగా పనిచేసే శ్రీహరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి గొట్టిపాటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  

[Minister drier Fied Road Accident, Gottipati Ravikumar, Minister Gottipatis driver Srihari, Chilakaluripet Road Accident, Palnadu Accident, Telugu One]