చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు.. అనగాని.!
Published on: Wed Sep 9, 2026 2:48PM

స్కిల్ కేసు పేరిట మూడేళ్ల కిందట అప్పటి ప్రతిపక్ష నేత, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని అప్పుడు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసింది. ఆ అరెస్టు అప్పట్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. కక్షసాధింపు ధోరణితో వ్యవహరించి అక్రమంగా చేసిన ఆ అరెస్ట్, అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని నియంతృత్వ పాలన పతనానికి నాంది పలికింది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి గురువారం (సెప్టెంబర్ 10) నాటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైసీపీపై విరుచుకుపడ్డారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవంఉన్న, అలాగే ప్రజా జీవితంలో ఎటువంటి మచ్చలేని నిజాయితీపరుడైన చంద్రబాబును అర్ధరాత్రి వేళ అన్యాయంగా అదుపులోకి తీసుకున్న జగన్ తీరును దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్టు జరిగిన రోజును తెలుగు జాతి చరిత్రలోనే బ్లాక్ డేగా అభివర్ణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు అరెస్టుకు కుట్ర చేశారని విమర్శించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ వ్యవహారంలో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా అక్రమంగా లబ్ధి పొందినట్లు ఎక్కడా నిరూపణ కాలేదని, దర్యాప్తు సంస్థల నివేదికలు కూడా అదే స్పష్టం చేశాయని గుర్తు చేసిన మంత్రి అనగాని.. రాజకీయ కక్షలతో 53 రోజుల పాటు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా నాయకుడిపై జరిగిన ఈ అన్యాయాన్ని భరించలేక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకం, పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి నిరసనలు తెలిపాయని ఆయన గుర్తు చేశారు.

నాడు నంద్యాల వేదికగా జరిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు.. ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకతను రగిలించిందనీ, ఆ వ్యతిరేకత, ఆగ్రహావేశాలే.. ఆనాడు వైఎస్ జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రధాన కారణమయ్యాయని అనగాని అన్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చారిత్రక మార్పునకు దారితీశాయనీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఒక బలమైన రాజకీయ కూటమిగా ఏర్పడి, భారతీయ జనతా పార్టీని కలుపుకుని ముందుకుసాగాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రజలు ఈ కూటమికి బ్రహ్మరథం పట్టారని తెలిపారు.
[Minister Anagani Satya Prasad On Chandrababu Naidu Illegal Arrest, YS Jagan Mohan Reddy, Skill Development Case, Telugu Desam Party, Telugu One]


