TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్: ఉద్యోగుల తొలగింపునకు మైక్రో సాఫ్ట్ సరికొత్త వ్యూహం.!

Published on: Tue Oct 27, 2026 11:34AM

టెక్ దిగ్గజ సంస్థ  మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు తెరతీసింది. అయితే రిట్రెంచ్ మెంట్ అనకుండా.. ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ అవకాశాన్ని ఇచ్చింది.  ఏఐ రంగంలో విపరీతమైన పెట్టుబడులు పెడుతున్న తరుణంలో, సంస్థ తన ఖర్చులను క్రమబద్ధీకరించుకోవడానికీ, అలాగే  అవసరాలకు తగినట్లుగా సిబ్బందిని సర్దుబాటు చేయడానికి ఈ వాలంటరీ ఎగ్జిట్ విధానాన్ని వినూత్నంగా తీసుకువచ్చింది. ప్రధానంగా ఇండియా, అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలలో మైక్రోసాఫ్ట్ లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఇచ్చింది. 

మైక్రోసాఫ్ట్ తాజా ఎగ్జిట్ ఆఫర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 వేల మందిపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. పేరుకు స్వచ్ఛంద ఉద్యోగ నిష్క్రమణ ఆఫర్ అయినా ఇది ఒక విధంగా ఉద్యోగుల తొలగింపేనని కార్పొరేట్ వర్గాలలో చర్చ జరుగుతోంది. అది పక్కన పెడితే దాదాపు 60 వేల మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ సంస్థ ఈ ఆఫర్ ఇచ్చింది.  ఇది లేఆఫ్ కానీ, కంపల్సరీ రిట్రెంచ్ మెంట్ కానీ కాదని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. ఈ ఆఫర్ ను తీసుకోవడమా లేదా అన్నది పూర్తిగా ఉద్యోగుల  నిర్ణయంపై ఆధారపడి ఉంటుందంటోంది.

సంస్థలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన, ఎంపిక చేసిన కొన్ని నిర్దిష్ట విభాగాలలో పనిచేస్తున్న సీనియర్,  మిడ్-లెవెల్ ఉద్యోగులు  ఈ ఆఫర్‌ను ఎంచుకునేందుకు అర్హులుగా మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఈ  పథకం కింద సంస్థను స్వచ్ఛందంగా వీడే ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఆర్థిక పరిహారం (సెవెరెన్స్ ప్యాకేజీ) ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఉద్యోగి హోదా, కంపెనీలో పూర్తి చేసిన సేవా కాలం, పనిచేస్తున్న దేశాన్ని బట్టి ఈ పరిహారం ఎంత అన్నది మారుతుంది.   

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,  క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక వసతులపై మైక్రోసాఫ్ట్ గత కొన్ని సంవత్సరాలుగా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. డేటా సెంటర్ల విస్తరణ, ఏఐ మోడళ్ల అభివృద్ధి కోసం వేల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్న నేపథ్యంలో..  సంస్థలోని వివిధ విభాగాల మధ్య వనరులను సమన్వయం చేసుకోవడం అనివార్యంగా మారింది.ఈ నేపథ్యంలోనే.. మానవ వనరులను సమర్థ వంతంగా నిర్వహించడానికి ఈ వాలంటరీ ఎగ్జిట్ పాలసీని మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చింది. 

అయితే ఈ ఆఫర్ మైక్రోసాఫ్ట్‌లోని అన్ని విభాగాలకూ వర్తించదు. భవిష్యత్తు వృద్ధికి  కీలకమైన క్లౌడ్, ఏఐ, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ, సేల్స్,  క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో పనిచేసే సిబ్బందిఈ ఆఫర్ కిందకు రారు.  విండోస్, ఎక్స్‌బాక్స్, కోపైలట్, ఫైనాన్స్,  హెచ్‌ఆర్ వంటి విభాగాలకు చెందిన వారు మాత్రమే ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ కు అర్హులు.  

భారతదేశంలో మైక్రోసాఫ్ట్‌లో  వేలాది మంది టెక్కీలు పని చేస్తున్నారు. సో మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ప్రభావం ఆ సంస్థలో పని చేస్తున్న ఇక్కడి ఉద్యోగులపై కూడా పడుతుంది. అయితే, ఈ ఆఫర్‌ను ఎంచుకోవాలా వద్దా అనే దానిపై ఉద్యోగులకు డిసెంబర్ ప్రారంభం వరకు గడువు ఇచ్చింది మైక్రోసాఫ్ట్.    మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ టెక్ ప్రపంచంలో  పెద్ద ఎత్తున  చర్చకు దారితీసింది. ఉద్యోగులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ఆర్థిక భరోసాతో కూడిన ఈ వెసులుబాటు ఒక అవకాశంగా కనిపిస్తున్నప్పటికీ, మారుతున్న ఐటీ ఉద్యోగ మార్కెట్ పరిస్థితులు మాత్రం నిపుణుల్లో ఆందోళనకు తావిస్తున్నాయి.   


[Microsoft Voluntary Exit Offer To Employees,  Microsoft Buyout, AI Investments Microsoft, Microsoft Layoffs, Telugu One]