మెటా లాసూట్.. టెక్ చరిత్రలోనే అతి పెద్ద కార్పొరేట్ విచారణ.!
Published on: Sat Aug 22, 2026 4:11PM

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్స్ అమెరికా చరిత్రలోనే కాకుండా, ప్రపంచ టెక్ రంగ చరిత్రలోనే అతిపెద్ద చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా నమోదు చేసిన ఈ కేసులో.. సపోజ్ ఫర్ సపోజ్ కోర్టు ప్రతికూల తీర్పును వెలువరిస్తే, కంపెనీ ఏకంగా 1.4 లక్షల కోట్ల డాలర్లు అంటు 1.4 ట్రిలియన్ డలర్ల జరిమానాలు లేదా నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఈ మొత్తం మెటా యొక్క ప్రస్తుత మార్కెట్ విలువకు దాదాపు సమానం కావడం గమనార్హం. చిన్న పిల్లలు, యువత తమ వేదికలకు బానిసలుగా మారేలా, మానసికంగా దెబ్బతినేలా కంపెనీ ఉద్దేశపూర్వకంగానే ఆకర్షణీయమైన, ప్రమాదకరమైన ఆల్గారిథమ్‌లను, ఫీచర్లను డిజైన్ చేసిందనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ,. ఈ విచారణ ఫలితం ఒక్క మెటా భవిష్యత్తునే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా డిజిటల్ నెట్‌వర్క్‌ల నిర్వహణ విధానాన్ని, బిజినెస్ మోడల్‌ను పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ వివాదానికి ప్రధాన విత్తనం 2021 సెప్టెంబరులో పడింది. అప్పట్లో ఫేస్‌బుక్ ఉద్యోగినిగా పనిచేసిన ఫ్రాన్సెస్ హౌగెన్ కంపెనీకి చెందిన వేలాది అంతర్గత పరిశోధనా పత్రాలను లీక్ చేయడంతో టెక్ ప్రపంచంలో కలకలం రేగింది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగం వల్ల ముఖ్యంగా టీనేజ్ బాలికల్లో శరీర ఆకృతి, అందం పట్ల ప్రతికూల భావనలు పెరుగుతున్నాయని, తీవ్ర ఆందోళన, నిరాశ, చివరికి ఆత్మహత్య ఆలోచనలకు కూడా ఇది దారితీస్తోందని మెటా సొంత పరిశోధనల్లో. 2019 నాటి ఒక ప్రదర్శన పత్రంలో మేము ప్రతి ముగ్గురు టీనేజ్ బాలికల్లో ఒకరి శరీర సమస్యలను మరింత దిగజారుస్తున్నాము అని కంపెనీ స్వయంగా నమోదు చేసుకుంది. ఇంతటి తీవ్రమైన ప్రమాదం ఉందని తెలిసి కూడా, లాభాపేక్షే ధ్యేయంగా కంపెనీ ప్రజల నుండి, అమెరికా ప్రజాప్రతినిధుల నుండి ఈ నిజాలను దాచి పెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 2021లో సెనేట్ కమిటీ ముందు హౌగెన్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా.. నవంబర్ 2021 నుండి కాలిఫోర్నియా నేతృత్వంలో బహుళ-రాష్ట్రాల దర్యాప్తు వేగవంతమైంది,.
గతంలో సిగరెట్ తయారీ కంపెనీలు తమ పొగాకు ఉత్పత్తుల వల్ల వచ్చే క్యాన్సర్ ప్రమాదాలను దాచిపెట్టి యువతను అలవాటు పరిచిన బిగ్ టొబాకో వ్యవహారంతో ఈ కేసును న్యాయ నిపుణులు, సెనేటర్లు పోలుస్తున్నారు. 2023 అక్టోబరు నాటికి దాదాపు 42 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ వేర్వేరు ఫెడరల్, రాష్ట్ర కోర్టులలో మెటాపై కేసులు వేయగా, ఓక్లాండ్‌లోని ఫెడరల్ కోర్టు ఈ కేసుల విచారణను చేపట్టింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు మొదటి విడతలో తమ వాదనలను గట్టిగా వినిపిస్తున్నాయి. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ చీఫ్ ఆడమ్ మొస్సేరి కూడా ఈ కోర్టు విచారణలో స్వయంగా హాజరై సాక్ష్యం చెప్పాల్సి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్‌లు, నోటిఫికేషన్‌లు, అంతులేని స్క్రోలింగ్, ఆటో ప్లే రీల్స్ వంటి ఫీచర్ల ద్వారా చిన్నారులను గంటల తరబడి స్క్రీన్‌లకు కట్టిపడేస్తున్నారని, 13 ఏళ్ల లోపు పిల్లల వ్యక్తిగత డేటాను తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించి ఫెడరల్ బాలల గోప్యతా చట్టాన్ని మెటా ఉల్లంఘించిందని రాష్ట్రాల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.
రాష్ట్రాల అటార్నీ జనరళ్లు కేవలం భారీ ఆర్థిక జరిమానాలనే కాకుండా, కంపెనీ పని తీరులో విప్లవాత్మక మార్పులను డిమాండ్ చేస్తున్నారు. అంతులేని స్క్రోలింగ్ విధానాన్ని నిలిపివేయాలని, వయస్సు ధృవీకరణ నిబంధనలను కఠినతరం చేయాలని, చిన్నారుల నుండి అక్రమంగా సేకరించిన డేటాతో పాటు ఆ డేటా ఆధారంగా శిక్షణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడళ్లను కూడా తక్షణమే డిలీట్ చేయాలని కోరుతున్నారు,.
ఒకవేళ ఏఐ మోడళ్లను తొలగించాలనే తీర్పు వస్తే.. అది మున్ముందు మెటా అమలు చేస్తున్న నవ సాంకేతిక పరిజ్ఞానాలపై కోలుకోలేని దెబ్బ తీస్తుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ ఆరోపణలను మెటా ఖండిస్తోంది. తాము పిల్లల రక్షణ కోసం ఇప్పటికే 30 కంటే ఎక్కువ డిజిటల్ సాధనాలను, పేరెంటల్ కంట్రోల్స్ అందుబాటులోకి తెచ్చామని, సోషల్ మీడియా వాడకం వల్ల వచ్చే మార్పులు పరిశ్రమ వ్యాప్త అంశమని, కేవలం తమ కంపెనీని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం తగదని వాదిస్తోంది.
ఈ సుదీర్ఘ విచారణ నేపథ్యంలో మెటా ఆర్థిక పరిస్థితిపై, స్టాక్ మార్కెట్ పనితీరుపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల మెటా షేర్లు గణనీయంగా క్షీణించాయి. చట్టపరమైన ఖర్చులు దాదాపు 55శాతం పెరగడం, ఉచిత నగదు ప్రవాహం దారుణంగా పడిపోవడం పెట్టుబడిదారులను కలవరానికి గురిచేస్తోంది. 1.4 ట్రిలియన్ అనేది మెటా ఊహించిన గరిష్ట స్థాయి నష్టపరిహార అంచనా అయినప్పటికీ, కోర్టు విధించే ఏ చిన్న ఆంక్షలైనా కంపెనీ ప్రకటనల ఆదాయాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది,. ఈ విచారణ ఏడు నుండి ఎనిమిది వారాల పాటు కొనసాగే అవకాశం ఉందనీ, ఈ తీర్పు ఇతర డిజిటల్ దిగ్గజాలైన టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్‌ల భవిష్యత్తుకు కూడా ఒక దిశానిర్దేశం లాంటి మార్గదర్శిగా మారనుందని పరిశ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు,.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Meta Lawsuit 2026, Instagram Kids Mental Health, Mark Zuckerberg Trial, Social Media Addiction Case, Meta 1.4 Trillion Lawsuit


