మగాళ్ల రహస్యం.. భార్యకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..!
Published on: Mon Nov 23, 2026 10:35AM
మగాళ్ల రహస్యం.. భార్యకు, కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..!
.webp)
మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే..
అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని..
కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు.
ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు..
ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు.
.webp)
చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు..
కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఇది కూడా చదవండి రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా
ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి..
సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు.
భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు..
చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు.
భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు..
భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు.
సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి..
పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు.
మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!


