పులివెందుల దాహార్తికి శాశ్వత పరిష్కారం మెగా వాటర్ గ్రిడ్.!
Published on: Tue Aug 25, 2026 11:15AM

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం అంటే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఈ నియోజకవర్గంలో దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. వైఎస్ మరణానంతరం ఈ నియోజకవర్గం వైఎస్ తనయుడు, వైసీపీ అధినేత జగన్ కు పెట్టని కోటగా ఉంటూ వస్తోంది. అయితే అటువంటి కంచుకోటకు 2024 ఎన్నికలలో బీటలు వారాయి. 2019 ఎన్నికలలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 91 వేల భారీ మెజారిటీతో విజయం సాధించిన వైసీపీ అధినేత జగన్.. 2024 ఎన్నికలో ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయారు.
2024 ఎన్నికలలో జగన్ మెజారిటీ దాదాపు 30 వేలు తగ్గింది. ఆ తరువాత పులివెందుల జెడ్పీటీసీకి జరిగినఉపఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అదీ అలాంటిలాంటి మెజారిటీతో కాదు.. పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం ఆరు వేలకు పైచిలుకు ఓట్ల తేడాతో గెలుచుకుంది. ఎన్నడూ లేని విధంగా జగన్ కోట అయిన పులివెందులలో ఆయనకు తగ్గుతున్న ఆదరణ.. ఆ కోటకు బీటలు వారడాన్ని ప్రస్ఫుటంగా చూపింది.
ఇక ఇప్పుడు ఆ కోటలో పాగా వేసే దిశగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక నిర్ణయం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలనూ అందుకుంటోంది. ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం అనేవి కేవలం రాజకీయ ప్రయోజనాలు, లబ్ధి కోసమే కాదనీ, అది ప్రజల పట్ల ప్రభుత్వాలకూ నేతలకూ ఉన్న బాధ్యతకు దర్పణమనీ పవన్ చాటారు.
ఎలాగంటే.. జల్ జీవన్ మిషన్-అమరావాణి వాటర్‌షెడ్ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా కడప జిల్లా పరిధిలో మంచినీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెడుతున్న పవన్ కళ్యాణ్.. వైసిపి హయాంలో ప్రతిపాదించి, ఆపై రకరకాల కారణాలతో నిర్లక్ష్యానికి గురైన అభివృద్ధి పథకాలపై ఆయన ప్రత్యేక చూపుతున్నారు. అందులో భాగంగానే పులివెందుల నియోజకవర్గం, దాని పరిసర ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా మెగా వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పని చేసిన జగన్ తన హయాంలో సొంత నియోజకవర్గమైన పులివెందుల తాగునీటి సమస్య పరిష్కారంలో ఘోరంగా విఫలమైతే..ప్రత్యర్థి పార్టీకి కంచుకోట అయినప్పటికీ పులివెందుల ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం కోసం.. పవన్ కల్యాణ్ నడుంబిగించారు. దీనిపై రాజకీయాలకు అతీతంగా పులివెందుల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీమలో నీటి కరవు పూర్తిగా తీరుస్తాం అని ప్రకటించిన చంద్రబాబు ఆశయ సాధన దిశగా పవన్ కల్యాణ్ వాటర్ గ్రిడ్ పథకాన్ని పరుగులు పెట్టిస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Mega Water Grid for Pulivendula, Pawan Kalyan,, AP Deputy CM, Jal Jeevan Mission, YSR Kadapa Water


