TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేడ్చల్‌లో ‘నకిలీ డాక్టర్ల’ దందా బట్టబయలు..!

Published on: Wed Sep 2, 2026 2:47PM

 

తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!

తెల్లకోటు.. చేతిలో స్టెతస్కోప్‌.. ఓ క్లినిక్‌.. బయట రోగుల క్యూ.. చూస్తే నిజమైన డాక్టర్‌ అనిపిస్తాడు. కానీ.. అతడికి ఎలాంటి వైద్య అర్హత లేదు! అయినా కొన్నేళ్లుగా యథేచ్ఛగా రోగులను పరీక్షిస్తూ.. అల్లోపతి మందులు ఇస్తూ.. ‘డాక్టర్‌’గా చలామణి అవుతున్నాడు. ఇదే తరహాలో మరో నలుగురు కూడా నకిలీ వైద్యుల అవతారం ఎత్తి రోగులకు చికిత్స అందిస్తున్నారు.

వైద్య అర్హత లేకపోయినా.. వైద్యం మాత్రం ఫుల్‌! మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో సాగుతున్న ఈ నకిలీ వైద్యుల దందాపై సమాచారం అందుకున్న SOT పోలీసులు రంగంలోకి దిగారు. పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు, దాడులు నిర్వహించి ఐదుగురు నకిలీ వైద్యుల ఆటకు చెక్‌ పెట్టారు.

పెట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపింది. ఎలాంటి గుర్తింపు పొందిన వైద్య విద్యార్హతలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ.. అల్లోపతి మందులు విక్రయిస్తూ.. రోగులకు చికిత్స చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మేడ్చల్‌ పరిధిలో ఇద్దరు.. జగద్గిరిగుట్ట, పెట్‌ బషీరాబాద్‌, సూరారం పరిధుల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి పెద్ద మొత్తంలో అల్లోపతి మందులు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

వైద్య అర్హతలు, అనుమతులు లేకుండా ప్రజలకు చికిత్స చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో అనుమతి లేని క్లినిక్‌లు, నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వైద్యం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Medchal Fake Doctors, Fake Doctors, Medical Fraud, SOT Police, Medchal-Malkajgiri, Pet Basheerabad, Jagadgirigutta, Suraram, Fake Clinics, Illegal Medical Practice, Unqualified Doctors, Allopathic Medicines, Medical Equipment, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police