TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హస్తినలో భారీ అగ్నిప్రమాదం

Published on: Wed Jun 24, 2026 9:02AM

దేశ రాజధాని నగరం ఢిల్లీలో బుధవారం (జూన్ 24) తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  సెంట్రల్ ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఒక్కసారిగా చెలరేగిన అగ్నికీలలు  కలకలాన్ని సృష్టించాయి.   ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో రాత్రింబగళ్లు శ్రమిస్తున్న నిర్మాణ రంగ కూలీలు నివసించే తాత్కాలిక నివాస ప్రాంతంలో  ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  అందరూ  గాఢనిద్రలో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో  కూలీలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.

 కాగా షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  అక్కడ ఉన్న ఒక ఎలక్ట్రిక్ ప్యానెల్‌లో  స్వల్పంగా మొదలైన మంటలు  వేగంగా అక్కడి  తాత్కాలిక గుడిసెలు, షెడ్లకు  వ్యాపించాయి.   నివాసాల్లో వంట కోసం నిల్వ ఉంచుకున్న కొన్ని  ఎల్పీజీ  సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి చొప్పున భారీ శబ్దాలతో పేలిపోయాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిలిండర్ల పేలుడు ధాటికి అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా   దట్టమైన పొగ కమ్మేసింది.  

 సమాచారం అందిన వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్  సిబ్బంది  ఘటనా స్థలానికి చేరుకున్నారు.   అత్యంత ప్రమాదకరమైన 'మేక్-4 కేటగిరీ' అగ్నిప్రమాదంగా వర్గీకరించి ఆపరేషన్ ప్రారంభించారు. ప్రమాద స్థలానికి   20కి పైగా అగ్నిమాపక యంత్రాలు అత్యాధునిక వాటర్ బౌజర్లను రంగంలోకి దించారు. గంటల తరబడి నిరంతరాయంగా శ్రమించి మంటలను అదుపు చేశారు.  మంటలు పక్కనే ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు వ్యాపించకుండా అడ్డుకున్నారు.  ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ పెను ప్రమాదం నుండి అందరూ ప్రాణాలతో బయటపడటంతో అటు అధికారులు, ఇటు స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలపై ఢిల్లీ పోలీసులు, ఫైర్ విభాగం అధికారులు  దర్యాప్తు జరుపుతున్నారు.