TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భార్యాభర్తల ఈ అలవాట్లు.. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేస్తాయ్..!

Published on: Fri Oct 9, 2026 11:09AM

భార్యాభర్తల ఈ అలవాట్లు.. సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేస్తాయ్..!


ఒక కుటుంబం నవ్వుతూ, సంతోషంగా సాగిపోవడానికి భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత అత్యంత కీలకం. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ గౌరవించుకున్నప్పుడే ఆ ఇల్లు ఆనందాల నిలయమవుతుంది. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఉన్నట్టుండి గొడవలు, మనస్పర్థలు ఎక్కువై ప్రశాంతత కొరవడుతుంది. దీనికి బయటి కారణాల కంటే భార్యాభర్తల చిన్నచిన్న  అలవాట్లే ప్రధాన కారణం అవుతుంటాయి. భార్యాభర్తలలోని  కొన్ని పొరపాట్లు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని ఆచార్య చాణక్యుడు కూడా  హెచ్చరించారు. చాణక్య నీతి ప్రకారం సంసార సుఖాన్ని, కుటుంబ శాంతిని దెబ్బతీసే భార్యాభర్తలలో ఉండే  నెగిటివ్  అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..

విషయాలను  దాచడం , అబద్దాలు చెప్పడం..

ఏ సంబంధానికైనా నమ్మకమే పునాది. భార్యాభర్తలు ఒకరికొకరు నిజాలు దాచడం లేదా అబద్ధాలు చెప్పడం మొదలుపెడితే ఆ బంధంలో మెల్లగా అనుమానాలు మొదలవుతాయి. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం తగ్గినప్పుడు లేదా నమ్మకం చెడిపోయినప్పుడు   ఆలుమగల మధ్య దూరం పెరుగుతుంది. ఇది కేవలం దంపతుల సంబంధాన్ని మాత్రమే కాకుండా ఇంట్లోని పిల్లల భవిష్యత్తుపై , మనశ్శాంతిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చాణక్యుడి ప్రకారం అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న ఇంట్లో ఎప్పటికీ  సంతోషం స్థిరంగా ఉండదు. సంసార బంధం సంతోషంగా ఉండాలంటే భార్యాభర్తలు ట్రాన్సపరెంట్ గా ఉండాలి.

ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడటం..

చాలామంది భార్యాభర్తలు  వేరొకరి ముందో లేదా మాటల ప్రవాహంలోనో ఒకరినొకరు చిన్నచూపు చూస్తూ మాట్లాడుతుంటారు. అలా ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం వల్ల వారి మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడతాయి. ఎప్పుడూ  తక్కువ చేసి మాట్లాడే ధోరణి వల్ల దంపతుల మధ్య గౌరవం నశించి, ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఒకరి గౌరవ మర్యాదలను మరొకరు కాపాడుకోవాలని చాణక్యుడు సూచించారు.

చిన్నదానికి కోపపడటం..

కారణం లేకుండా లేదా చిన్న విషయాలకే కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఇంట్లోని సంతోషం ఆవిరైపోతుంది. ఎప్పుడూ ఆగ్రహంతో ఊగిపోయే స్వభావం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోయి, గొడవలు రోజూ  కొనసాగుతాయి. ప్రశాంతమైన జీవనానికి కోపాన్ని  అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు విపరీతమైన కోపాన్ని ప్రదర్శించినా ఆ ప్రభావం ఇల్లంతా వ్యాపిస్తుంది.

స్వార్థపూరితమైన ఆలోచనలు..

కుటుంబం అంటేనే త్యాగం, సహకారం. కేవలం తమ గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపూరిత మనస్తత్వం భార్యాభర్తల్లో ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. ఇతరుల శ్రేయస్సును పట్టించుకోకుండా, స్వార్థంతో వ్యవహరించే వారి ఇల్లు త్వరలోనే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. దాంపత్య జీవితం కలకాలం నిలవాలంటే స్వార్థాన్ని వీడి ఒకరికొకరు తోడుగా, సమన్వయంతో సాగిపోవడం చాలా ముఖ్యం.


                             *రూపశ్రీ.