TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్ లో అగ్ని ప్రమాదం: కాలి బూడిదైన వీఐపీ కాటేజ్.!

Published on: Mon Oct 26, 2026 2:24PM

ఏపీలో ప్రముఖ పర్యాటక   కేంద్రమైన మారేడుమిల్లిలో  భారీ  అగ్నిప్రమాదం సంభవించింది.  ప్రకృతి అందాల నడుమ ఏర్పాటు చేసిన  ది వుడ్స్  రిసార్ట్‌లో సోమవారం (అక్టోబర్ 26) ఉదయం  జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ఓ వీఐపీ కాటేజ్ పూర్తిగా కాలిపోయింది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ గదిలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

  మారేడుమిల్లి మండల కేంద్రంలో రంపచోడవరం ఐటీడీఏ నిధులతో దాదాపు  9 కోట్ల రూపాయల వ్యయంతో  ది వుడ్స్ రిసార్ట్‌ను నిర్మించారు.   దీని నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్  కాంట్రాక్టర్ కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ దీనిని  పర్యాటకుల విడిది కోసం వీటిని కిరాయికి ఇస్తున్నారు. సోమవారం ఉదయం   లగ్జరీ వుడెన్‌ కాటేజ్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ కాటేజ్ నిర్మాణంలో దాదాపు 70 శాతం మేర కలపను ఉపయోగించడంతో మంటలు క్షణాల్లోనే  వ్యాప్తిచాయి.  ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అప్పటికే ఆ గదిలో బస చేసిన పర్యాటకులు   బయటకు వెళ్లిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ రిసార్ట్‌లో గతంలో  పుష్ప' సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్  బస చేయడం విశేషం. ప్రముఖులు వచ్చి విడిది చేసిన ఈ వీఐపీ సూట్ ఇలా అగ్నికి ఆహుతి కావడం  స్థానికంగా కలకలం రేగింది.

ఈ ఘటనతో ప్రభుత్వ,  ప్రైవేట్ రిసార్టులలో ఫైర్ సేఫ్టీ పై ఆందోళన వ్యక్తమవుతోంది. రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు ప్రాంతాల్లో వందలాది రిసార్టులు నడుస్తుండగా, చాలా చోట్ల కనీస భద్రతా ప్రమాణాలు కూడా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అత్యవసర సమయాల్లో మంటలను ఆర్పేందుకు అవసరమైన పరికరాలు,  స్ప్రింక్లర్లు లేకపోవడం వల్ల చిన్నపాటి షార్ట్ సర్క్యూట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అంటున్నారు. గతంలోనూ అనేక పర్యాయాలు రిసార్టులలో ఫైర్ సేఫ్టీ కొరవడిందంటూ ఆరోపణలు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.  


[Maradumilli Resort Fire Accident, The Woods Resort, Allu Arjun VIP Cottage Maradumilli,  AP Tourism, Telugu One]