రీల్స్ పిచ్చి పీక్స్: లైకుల కోసం ఇంత తెగింపా.!
Published on: Fri Sep 25, 2026 3:12PM
.webp)
సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోవర్స్, వ్యూయర్స్ సంపాదించాలనే పిచ్చి నేడు ఎంతోమంది యువతను తప్పుదారి పట్టిస్తోంది. ఏకంగా లైకులు, షేర్ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా చట్టపరమైన తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో వెలుగు చూసిన ఒక సంచలన సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో తమ ఛానెల్స్‌కు ఫాలోవర్స్ పెంచుకోవాలనే దుర్బుద్ధితో ఇద్దరు యువకులు చేసిన సాహసం చివరికి వారిని కటకటాల వెనక్కి నెట్టింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన బండ మధు అనే యువకుడు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి సోషల్ మీడియాలో రీల్స్ చేసే అలవాటు ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘అలెగ్జాండర్-విపిన్’ పేరిట, యూట్యూబ్‌లో ‘పవర్ ఆఫ్ మనీ’ పేరిట అకౌంట్లు నిర్వహిస్తున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా తన అకౌంట్లలో ఫాలోవర్స్ పెరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎలాగైనా తన పేజీని వైరల్ చేయాలని భావించిన మధు, తన యజమానితో కలిసి మేడారం వెళ్లిన సమయంలో అక్కడ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన మావోయిస్టుల లేఖను చూశాడు. ఆ లేఖే అతని ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది మావోయిస్టులకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఒక నకిలీ బెదిరింపు లేఖను సృష్టించాలని పథకం వేశాడు.
ఈ వికృత ఆలోచనకు సాంకేతికతను జోడించి, చాట్‌జీపీటీ (ChatGPT) సహాయంతో ఒక మావోయిస్టు బెదిరింపు లేఖను ఇంగ్లీష్ లేదా తెలుగులో తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ లేఖను ఎర్రటి వస్త్రంపై రాసి, దానిని మరింత ప్రమాదకరంగా మార్చాడు. ఈ నేరంలో అదే గ్రామానికి చెందిన చింతకింది శ్రీధర్ అనే మరో యువకుడిని తనతో కలుపుకున్నాడు. పథకం ప్రకారం ఇద్దరూ కలిసి బైక్‌పై తూప్రాన్‌కు చేరుకున్నారు. అక్కడ స్థానిక మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈ మావోయిస్టు బెదిరింపు లేఖలను ఉంచారు.

అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్‌లో ఉన్న గార్డ్ గట్టిగా కేకలు వేయడంతో ‘మై ఛత్తీస్‌గఢ్ సే ఆయా’ అంటూ అక్కడి నుంచి భయంతో బైక్‌పై పరారయ్యారు. తాము చేసిన ఈ విద్రోహ చర్యను మరింత ప్రచారం చేసుకోవాలనే దురాశతో, ఆ మావోయిస్టు బెదిరింపు లేఖను మధు తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అనుకున్నట్లుగానే ఆ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అంతేకాకుండా ఆ లేఖను తన స్నేహితులకు కూడా షేర్ చేసి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు.ఈ సంఘటనను అత్యంత సీరియస్‌గా పరిగణించిన మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేయగా, ఈ లేఖ రాసింది బండ మధు, చింతకింది శ్రీధర్‌లుగా పోలీసులు నిరూపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.
.webp)
వీరికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని, కేవలం ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో ఫాలోవర్స్, వ్యూయర్స్ పెంచుకోవాలనే ఒక్క ఉద్దేశంతోనే ఈ నకిలీ లేఖ నాటకం ఆడినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్లు, రెయిన్‌కోట్, శాలువాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి చట్టవిరుద్ధమైన, ప్రమాదకరమైన పనులకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయని, యువత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కేసును అత్యంత తక్కువ సమయంలో చేధించి నిందితులను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
[ Maoist letter Instagram, Medak News, Social Media Followers Risk, Telangana Crime News, Chatgpt Fake letter, Tupran Police arrest, Telugu One, Telugu News ]


