గురువారం పైనే అందరి గురి!

సినిమాలు ఎక్కువగా శుక్రవారం విడుదలవుతుంటాయి. ఎందుకంటే విడుదల రోజు ఎలాగూ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంటే థియేటర్లకు వస్తారు. అలాగే రెండో రోజు, మూడో రోజు వీకెండ్ అవుతుంది. ఇలా మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు రాబట్టడానికి అవకాశముంటుంది. అందుకే సినిమా విడుదల అంటే శుక్రవారమే అనే ముద్ర పడిపోయింది. అయితే ఇప్పుడు శుక్రవారం ప్లేస్ లోకి గురువారం వస్తోంది.

ఇటీవల చాలా సినిమాలు గురువారంకి గురి పెట్టాయి. జూన్ 27న 'కల్కి 2898 AD', ఆగస్టు 15న 'పుష్ప-2', ఆగస్టు 29న 'సరిపోదా శనివారం', అక్టోబర్ 10న 'దేవర' విడుదల కానున్నాయి. ఈ తేదీలన్నీ గురువారమే కావడం విశేషం. ఏదైనా హాలిడే తోడైతే, లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని కొందరు మేకర్స్ గురువారం తమ సినిమాని విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే టాక్ తో సంబంధం కనీసం రెండు మూడు రోజులు థియేటర్ల దగ్గర సందడి ఉంటుంది. అందుకే గురు, శుక్ర వారాలు హీరో స్టార్డంతో కలెక్షన్స్ వస్తే.. శని, ఆది వారాల్లో వీకెండ్ కారణంగా కలెక్షన్స్ వస్తాయని భావించి.. మేకర్స్ గురి గురువారంపై పడిందని అంటున్నారు. ఇక నుంచి స్టార్ల సినిమాలు ఎక్కువగా గురువారం విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.