TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మన్మోహన్ సింగ్ కు భారతరత్న: తెలంగాణ సీఎం రేవంత్ డిమాండ్.!

Published on: Sun Sep 27, 2026 7:43AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి ప్రజల ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు భారతరత్న  ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్‌రెడ్డి   డిమాండ్ చేశారు.   దేశానికి ఆయన అందించిన  సేవలను చిరకాలం గుర్తుంచుకునేలా ఢిల్లీలో ఒక ప్రత్యేక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని  కోరారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జయంతి సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 26) హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ విప్రో సర్కిల్‌లో ఆయన   విగ్రహాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా ప్రసంగించిన ఆయన  జాతిరత్నం  మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వానికి   అభ్యంతరం ఎందుకని నిలదీశారు.  రాజకీయాలకు అతీతంగా కొన్ని సమయాల్లో గొప్ప వ్యక్తుల సేవలను గుర్తించి కేంద్రం సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఎటువంటి ఆర్భాటాలకు పోకుండా, మౌనమునిలా నిశ్శబ్దంగా దేశ ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ ముందుకు నడిపించారన్నారు.మన్మోహన్ కు భారతరత్న  డిమాండ్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పార్లమెంటు వేదికగా ఈ అంశాన్ని బలంగా ప్రస్తావించాలని ఆయనీ సందర్భంగా ఎంపీలకు పిలుపునిచ్చారు.  

మన్మోహన్ సింగ్ జయంతి రోజున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు  గర్వకారణమన్న రేవంత్ రెడ్డి.. భారతదేశం   గర్వించదగ్గ జాతిరత్నంగా మన్మోహన్ సింగ్ ను అభివర్ణించారు.  , ఆయన ఆదర్శాలను భావితరాలకు అందించాలన్న సంకల్పంతోనే  విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా ఆ అత్యున్నత   పదవులకే ఆయన వన్నె తెచ్చారని కొనియాడారు.

 ఆనాడు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసి స్వాతంత్య్రం తెచ్చిన ఘనత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ది అయితే, దశాబ్దాల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత మాత్రం కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కే దక్కుతుందనీ, అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ మన్మోహన్ సింగ్ సంతకం చేసిన  పత్రాన్ని ఇక్కడ చిరస్థాయిగా పదిలపరిచామని వెల్లడించారు.  

[Manmohan Singh, Bharat Ratna, CM Revanth Reddy, Telangana Formation, Economic Reforms, Telugu One]