TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదరికాన్ని జయించి విశ్వవిజేతగా: ట్రాప్ షూటర్ మనీషా కీర్ రియల్ స్టోరీ!

Published on: Tue Sep 1, 2026 11:45AM

కష్టాలు ఎదురైనప్పుడు చాలామంది వెనకడుగు వేస్తారు. కానీ కొందరు మాత్రం ఆ ప్రతికూలతలనే తమ గెలుపుకు పునాదులుగా మలుచుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామానికి చెందిన మనీషా కీర్ కథ సరిగ్గా అలాంటిదే. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన మనీషాకు చిన్నతనంలో షూటింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఆమెకు కేవలం క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు మాత్రమే తెలుసు. అటువంటి అమ్మాయి ఈ రోజు భారత్ తరఫున అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రయాణం కేవలం ఒక క్రీడాకారిణి విజయం మాత్రమే కాదు, అపారమైన ఆత్మవిశ్వాసానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం.

మనీషాను క్రీడారంగం వైపు నడిపించడంలో ఆమె అక్క సోనా కీలక పాత్ర పోషించారు. అక్క ప్రోత్సాహంతోనే మనీషా షూటింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ క్రీడలోకి రావడం ఒక ఎత్తయితే, దానిని కొనసాగించడం మనీషా కుటుంబానికి ఎంతో భారంగా మారింది. షూటింగ్ అనేది అత్యంత ఖరీదైన క్రీడ. గన్, తులసీ బులెట్లు, శిక్షణ పరికరాలు, ప్రయాణాలు.. ఇలా ప్రతిదానికీ ఎంతో ఖర్చు అవుతుంది. ఆర్థికంగా ఏమాత్రం స్థిరత్వం లేని కుటుంబం నుండి వచ్చిన మనీషాకు ఈ ప్రయాణం ఎన్నో సవాళ్లను విసిరింది. చిన్నవయసులోనే అంటే కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది.

పోటీల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు డబ్బులు ఆదా చేసుకోవడం కోసం కనీసం తగినంత ఆహారం కూడా తినకుండా ఎన్నో రోజులు ఆకలితో అలమటించింది. ఏది తినాలనిపించినా మనసులోనే అణచుకుని, గమ్యం వైపే అడుగులు వేసింది. మధ్యప్రదేశ్ స్టేట్ షూటింగ్ అకాడమీలో చేరిన కొత్తలో సరైన రెగ్యులర్ కోచ్ కూడా లేకపోవడం ఆమెను మరిన్ని ఇబ్బందులకు గురిచేసింది. కానీ మనీషా ఎప్పుడూ లేని వసతుల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేయలేదు. అందుబాటులో ఉన్న వనరులతోనే నేర్చుకోవడమే అలవాటు చేసుకుంది. "మన దగ్గర ఏది ఉందో దాంతోనే ఉత్తమ ఫలితాలను సాధించాలి" అనే దృఢమైన నమ్మకమే ఆమెను ముందుకు నడిపించింది.

 

 

 

manisha keer asian games silver medalist,indian trap shooter manisha keer biography.