స్వచ్ఛ పాఠశాల: 75 వేల కిలోల చెత్త సేకరణ.. మంగళగిరి విద్యార్థుల వరల్డ్ రికార్డ్.!
Published on: Sat Oct 3, 2026 12:02PM

పర్యావరణ పరిరక్షణ, పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో మంగళగిరి విద్యార్థులు చరిత్ర సృష్టించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో సుమారు 35 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంతా కలిసి 75 వేల కిలోల పొడి చెత్త (వ్యర్థాలు) సేకరించారు. ఈ కార్యక్రమానికి లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. చిన్న వయసులోనే సామాజిక బాధ్యతను చాటుకున్న విద్యార్థులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
.webp)
పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, శ్రమదానం వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 170 పాఠశాలలకు చెందిన 35 వేల మంది విద్యార్థులు విద్యార్థులు తమ ఇళ్లు, పాఠశాలలు, పరిసర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్, కాగితం తదితర పొడి వ్యర్థాలను సేకరించి వాటిని వేర్వేరుగా విభజించి నిర్దేశించిన సేకరణ కేంద్రాలకు తరలించారు.
ఇలా విద్యార్థులు సేకరించిన చెత్త 75 వేల కిలోలు ఉంది. విద్యార్థులు ఈ స్థాయిలో వ్యర్థాలను సేకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను చాటారు. పునర్వినియోగం, రీసైక్లింగ్‌కు అనువుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా పరిశుభ్రతపై ఆచరణాత్మక అవగాహన పెంపొందించే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు విద్యార్థుల భాగస్వామ్యం, వ్యర్థాల సేకరణ వంటి అంశాలను ధ్రువీకరించి గుర్తింపు పత్రాన్ని అందించారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన ఈ కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. చిత్తశుద్ధితో, అకుంఠిత దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, వారికి సహకరించిన ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, నిర్వాహకులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
.webp)
కాగా, మంగళగిరి విద్యార్థులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించడంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, శ్రమదానం వంటి విలువలను చిన్న వయసు నుంచే అలవర్చుకోవడం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
[Mangalagiri Students World Book of Records, Swachha Paathashaala Mangalagiri, Nara Lokesh Appreciation, AP Students World Record, Cleanliness Drive, Telugu One]


