విమానంలో సాంకేతిక లోపం.. బెంగళూరు ఎయిర్ పోర్టులోనే ఫ్లైట్.. కేబినెట్ భేటీకి ఏపీ మంత్రి దూరం.!
Published on: Wed Sep 23, 2026 11:54AM

బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. ఈ విమానంలో ఏపీ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి సచివాలయంలో జరిగే ఏపీ కేబినెట్ భేటీకి సకాలంలో చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ విమానంలో బోర్డ్ అయ్యారు. ఇక కొద్ది క్షణాల్లో విమానం టేకాఫ్ అవుతుందనుకుంటున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని నిలిపివేశారు.
అయితే, విమానం తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమయానికి గమ్యస్థానం చేరాల్సిన తమకు ఇలా విమానాశ్రయంలో చిక్కుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విమానంలో సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన వెంటనే విమానం టేకాఫ్ అవుతుందని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ భేటీకి హాజరు కాలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కీలక అంశాలు చర్చించాల్సిన కేబినెట్ భేటీకి సకాలంలో హాజరవ్వాలన్న ఉద్దేశంతోనే కారులో కాకుండా విమానంలో బయలుదేరాననీ, సాంకేతిక లోపం కారణంగా ఇలా బెంగళూరు ఎయిర్ పోర్టులో చిక్కుకు పోయాననీ ఆవేదన వ్యక్తం చేశారు.
{Mandipalli Ramaprasad Reddy, Air India Express, Bengaluru Airport, Technical Snag, Vijayawada Flight, AP Cabinet Meeting, Telugu One}


