ఆఫీస్ కొలీగ్స్ తో స్నేహం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Published on: Thu Oct 15, 2026 6:23PM
ఆఫీస్ కొలీగ్స్ తో స్నేహం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ తప్పులు మాత్రం చేయకండి..!

మన జీవితంలో చాలా సమయం ఆఫీసులోనే గడుస్తుంది. అలాంటప్పుడు సహోద్యోగులతో మంచి అనుబంధం ఏర్పడటం చాలా సహజం. ఆఫీసులో మంచి స్నేహితులు ఉంటే పని ఒత్తిడి తగ్గడమే కాకుండా, పని చేసే వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. కలసి భోజనం చేయడం, పనిలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. అయితే, అదే స్నేహం ఒక్కోసారి హద్దులు దాటితే వృత్తిపరమైన ఎదుగుదలకు, కెరీర్కు పెద్ద అవరోధంగా మారే ప్రమాదం ఉంది.ఆఫీసులో స్నేహం చేయడం తప్పు కాకపోయినా, కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ప్రొఫెషనల్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఉద్యోగంలో విజయం సాధించాలన్నా, ఉన్నతాధికారుల వద్ద మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నా స్నేహం విషయంలో కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఆఫీస్ స్నేహాల్లో సాధారణంగా చేసే పొరపాట్లు, వాటి వల్ల కలిగే నష్టాలు ఏంటో వివరంగా తెలుసుకుంటే..
అతిగా వ్యక్తిగత విషయాలు పంచుకోవడం..
ఆఫీసులో ఉండే ప్రతి సహోద్యోగితో మీ జీతం, కుటుంబ సమస్యలు లేదా మీ భవిష్యత్ కెరీర్ ప్లాన్లను పంచుకోవడం అస్సలు మంచిది కాదు. మీరు నమ్మి చెప్పిన రహస్యాలు లేదా వ్యక్తిగత విషయాలు అనుకోకుండా ఇతరులకు తెలిస్తే, అవి మీ ఉద్యోగానికి ఇబ్బందిగా మారవచ్చు. అందుకే ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే పరిమితంగా విషయాలను పంచుకోవాలి.
స్నేహం వల్ల పని దెబ్బతినడం..
మంచి స్నేహితుడికి సహాయం చేయడం మంచిదే అయినప్పటికీ, ప్రతిసారీ వారి పని భాద్యతలను మీ భుజాన వేసుకోవడం వల్ల మీ సొంత పర్ఫామెన్స్ తగ్గిపోతుంది. దీనివల్ల మీ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయలేక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ పని ప్రాధాన్యతలను స్పష్టంగా తెలుసుకుని, స్నేహానికి, పనికి మధ్య సరిహద్దులు గీసుకోవడం చాలా ముఖ్యం.
ఆఫీసు రాజకీయాల్లో చిక్కుకోవడం..
స్నేహితుడి మాటలు విని ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం లేదా ఆఫీసు వర్గపోరులో భాగం కావడం వల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇలాంటి విషయాల్లో నిష్పాక్షికంగా ఉండటం, ప్రతికూల చర్చలకు దూరంగా ఉండటం వల్ల మీరు అందరి వద్ద మంచి పేరు నిలుపుకోగలుగుతారు.
పని మరియు స్నేహం మధ్య బ్యాలెన్స్..
ఆఫీసుల్లో స్నేహ సంబంధాలు ఎంత ముఖ్యమో, వృత్తిపరమైన బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. మర్యాదగా ప్రవర్తిస్తూ, నిష్పాక్షికంగా ఉంటూ, మీ పనిపై దృష్టి పెడితే స్నేహాన్ని కాపాడుకుంటూనే కెరీర్లో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు.


