TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కృష్ణా జలాలపై కేటీఆర్ కొత్త నాటకాలు: దుయ్యబట్టిన మహేష్ కుమార్ గౌడ్.!

Published on: Thu Nov 19, 2026 11:58AM

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల వాటా అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో  ఇరిగేషన్ విషయంలో చేసిన తప్పులను, రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ, శ్రీరంగ నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.  ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు   కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు, తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుమంతైనా రాజీపడే ప్రశక్తే లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.  

కృష్ణా జలాల పంపిణీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్న టీపీసీసీ చీఫ్.. గతంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు 36 శాతం వాటా చాలని కేసీఆర్ అంగీకరించారని,   ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి 70 శాతం వాటా దక్కాలనే లక్ష్యంతో గట్టిగా పోరాడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 4,464 టీఎంసీల నీటిని వాడుకుంటే, తెలంగాణకు 1,993 టీఎంసీలు మాత్రమే దక్కాయని గణాంకాలతో సహా వివరించిన ఆయన నాగార్జునసాగర్ నుంచి అక్రమంగా నీళ్లు తరలిపోకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు.

ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు గత ప్రభుత్వమే సమ్మతి తెలిపిందన్న మహేష్ కుమార్ గౌడ్,  బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి లేఖలు రాసింది కాంగ్రెస్ సర్కారేనని గుర్తు చేశారు.  తెలంగాణ అభ్యంతరాల కారణంగానే ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు నిలిచిపోయాయనీ,  రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

డ్యామ్ వద్ద కేంద్ర బలగాలు, కేఆర్ఎంబీ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ, కేంద్రాన్ని ఒక్క మాట కూడా ప్రశ్నించకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దీని వెనుక బీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారీ ఒప్పందం దాగి ఉందని ఆరోపించారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయినిగా నిలిచే ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను పదేళ్ల పాటు పక్కన పెట్టారని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గత పదేళ్లలో కృష్ణా బేసిన్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్, సాగునీటి ప్రాజెక్టుల పేరుతో  రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ఆధునీకరణ, డిండి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పెరిగి ఉండేదన్నారు. మరోవైపు, లోపభూయిష్టంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, జాతీయ స్థాయి నిపుణులే నివేదికలు ఇచ్చారని గుర్తు చేసిన మహేష్ కుమార్ గౌడ్.. నెహ్రూ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలుగా నిలిచాయన్నారు.

ఇది కూడా చదవండి: దమ్ముంటే తలసానిని ప్రతిపక్ష నేతను చేయండి.. పీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!​

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాల అమలుపై మాట్లాడుతూ, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరేనని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్  బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెల్లించిందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని చౌకబారు ప్రకటనలు చేసినా, డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై స్పందిస్తూ, కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ పరిణామాలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందని, సమయానుకూలంగా తగిన నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అలాగే, కొత్తగా నియమితులైన ఇంచార్జీ సందీప్ ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడని, ఆయన సేవలు పార్టీ బలోపేతానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మొత్తంగా కృష్ణా జలాల వాటా, ప్రాజెక్టుల నిర్మాణంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో బనకచర్ల వివాదం, న్యాయపోరాటంతో పాటు కాంగ్రెస్ అంతర్గత క్రమశిక్షణపై అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.

మీకు నచ్చవచ్చు:  పవన్ బీజేపీ ఆడించే తోలుబొమ్మ : మహేశ్ కుమార్ గౌడ్​

పార్టీ మార్గదర్శకాలు దాటితే చర్యలు తప్పవు.. టీపీసీసీ చీఫ్ హెచ్చరిక..!

[MaheshKumarGoud, tpcc cHIEF, Krishna Water Dispute, Telangana Congress, Kaleshwaram Project, TeluguOne]